Maryam Nawaz Punjab Province CM : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఆమె ఎంపికయ్యారు. పాకిస్థాన్ చరిత్రలో ఓ ప్రావిన్సుకు మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. 50 ఏళ్ల మరియం నవాజ్ ప్రస్తుతం పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్-PMLN సీనియర్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఎన్నికలో తన ప్రత్యర్థి, ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న సున్ని ఇత్తెహాద్ కౌన్సిల్-SIC అభ్యర్థి రానా అప్తాబ్‌పై గెలుపొందారు. SIC అభ్యర్థులు వాకౌట్ చేయడం వల్ల మరియం సునాయసంగా విజయం సాధించారు. మరియంకు మొత్తం 220 ఓట్లు వచ్చాయి. SIC కి చెందిన 103 మంది అభ్యర్థులు ఎన్నికను బహిష్కరించారు. దీంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థి రానా అఫ్తాబ్‌కు సున్నా ఓట్లు వచ్చాయని నూతనంగా ఎన్నికైన స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.
పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో మొత్తం 327 సీట్లు ఉండగా సీఎంగా ఎన్నికవ్వాలంటే 187 మెజారిటీ మార్క్ రావాల్సి ఉంటుంది. 1992లో మరియం నవాజ్, సఫ్దార్ అవాన్ అనే మాజీ ఆర్మీ అధికారిని వివాహమాడారు. ఆమెకు ముగ్గురు సంతానం. 2012లో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన మరియం, PMLN పార్టీలో పలు పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఆదేశ జాతీయ అసెంబ్లీతో పాటు, ప్రావిన్సియల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.