Maldives Parliamentary Polls: మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు, చైనా అనుకూల నేత మహ్మమద్ ముయిజ్జుకు చెందిన పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఆదివారం 93 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ 60పైగా స్థానాలు కైవసం చేసుకుని సూపర్ మెజారిటీని సాధించింది.
మాల్దీవుల్లో మొత్తం 2.84 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 72.96శాతం ఓటింగ్ నమోదైంది. అధికార పార్టీ పీఎన్‌సీ 90 స్థానాల్లో పోటీ చేసింది. 60పైగా సీట్లతో మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలుపొందింది. ఇక ప్రధాన ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ 89 స్థానాల్లో పోటీ చేసి 12చోట్ల గెలుపొందింది. మరో 10స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. మాలే పట్టణంతోపాటు అడ్డు, ఫువాముల్లా పట్టణాల్లోని మెజారిటీ స్థానాలను మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు నేతృత్వంలోని పీఎన్‌సీ కైవసం చేసుకుంది. తాము ఈ ఫలితాలను ఊహించలేదని ప్రతిపక్ష మాల్దీవుల డెమోక్రాటిక్ పార్టీ పేర్కొంది.
భారత్ మాకు మిత్ర దేశమే
గతేడాది నవంబరులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ముయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను కూడా వెనక్కి పంపించారు. మే 10 నాటికి భారత్‌కు చెందిన బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని గడువు విధించారు. అయితే, గత నెలలో భారత విషయంలో ముయిజ్జు ఒక్కసారిగా మాట మార్చారు. భారతదేశం మాల్దీవులకు ఎప్పటికీ సన్నిహిత మిత్రుడిగా కొనసాగుతుందని చెప్పారు. అంతేకాకుండా ఆ దేశం నుంచి రుణవిముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని, అందులో ఎలాంటి సందేహం లేదని తొలిసారిగా స్థానిక మీడియాకు ముందుకు వచ్చి ముయిజ్జు చెప్పారు. గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని ముయిజ్జు అభ్యర్థించారు.
అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ దాడి- 14 మంది పాలస్తీనీయన్లు మృతి- వారికి అగ్రరాజ్యం భారీ ఆర్థిక సాయం - Israel Attack On Gaza
ఇరాన్లో భారీ శబ్దంతో పేలుడు- ఎయిర్ ఢిపెన్స్ అలర్ట్- ఇజ్రాయెల్ ప్రతీకార దాడి! - Iran Israel War