Los Angeles Wildfire : కార్చిచ్చుల ధాటికి అమెరికాలోని లాస్ఏంజెలెస్ నగరం వైభవాన్ని కోల్పోయింది. ఇజ్రాయెల్ దాడుల్లో స్మశానంగా మారిన గాజా లాగా, అణుబాంబు పడిన నాగసాకిలా నగరంలోని చాలా ప్రాంతాలు మారిపోయాయి. పాలిసైడ్స్ కార్చిచ్చు సాంటా మోనికా నుంచి మాలిబు వరకు, ఇటు ఈటన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా- 34వేల ఎకరాలకు పైగా బూడిద చేసి లాస్ఏంజెలెస్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్చిచ్చులుగా నిలిచిపోయాయి. ప్రస్తుతానికి గాలుల వేగం తగ్గడం వల్ల సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ- ఆ పరిస్థితి ఎంతో సేపు ఉండదని, మరింత వేగంగా గాలులు వీస్తాయని వాతావరశాఖ అంచనా వేసింది.
కార్చిచ్చు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న సహాయక సిబ్బంది (Associated Press) పసిఫిక్ తీరం నుంచి పసాదేనా తీరం వరకు 10వేలకుపైగా ఇళ్లు, ఇతర నిర్మాణాలను అగ్ని కీలలు ఆహుతి చేయగా ఇప్పటివరకు 10 మంది మరణించారు. కొన్ని దావాగ్నులు అదుపులోకి వచ్చినా పాలిసాడ్స్, అల్టాడెనా ఫైర్‌లు మండుతూనే ఉన్నాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలతో సహా లక్ష80వేల మందిని తరలించగా మరో 2లక్షల మందికి ముప్పు పొంచిఉందని అధికారులు తెలిపారు. హాలీవుడ్, హాలీవుడ్ హిల్స్‌కు ముప్పుగా వాటిల్లిన సన్సెట్ ఫైర్‌ను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. మంటల కారణంగా రూ.12 లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆక్యూ వెదర్ అంచనా వేసింది.
కార్చిచ్చు ధాటికి ధ్వంసమైన ఇళ్లు (Associated Press) కార్చిచ్చు ధాటికి ధ్వంసమైన లాస్‌ఎంజెలెస్‌లోని ఓ ప్రాంతం (Associated Press) లాస్ఏంజెలెస్‌లోని స్కూళ్లు, కార్యాలయాలను ప్రభుత్వం మూసేవేసింది. కార్చిచ్చులు సహా గాలి కాలుష్యం అదుపులోకి వచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. వెస్ట్ హిల్స్, కాలాబాసాస్ సమీపంలో వేగంగా కదులుతున్న కెన్నెత్ ఫైర్‌ను అదుపు చేసేందుకు అదనపు సిబ్బందిని మోహరించారు. మంటలను అదుపు చేసేందుకు కాలిఫోర్నియాకు అగ్నిమాపక పరికరాలు, మానవ వనరులను తరలిస్తామని కెనడా ప్రకటించింది.
ఇల్లు కోల్పోయిన నటి గ్లోరియా సాండోవల్కు సహాయం చేస్తున్న వాలంటీర్లు (Associated Press) నిరాశ్రయులకు తాత్కాలిక శిబిరంలో పండ్లు అందిస్తున్న వాలంటీర్ (Associated Press) భయంకరమైన కార్చిచ్చు కారణంగా లాస్ఏంజెలెస్లో వాతావరణ కాలుష్యం భారీగా పెరిగింది. దక్షిణ కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల ప్రజలు ఎయిర్ ఫ్యూరిఫైర్లు, మాస్క్‌లు ధరించడం, ఇన్‌హేలర్లు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్వాస సంబంధ వ్యాధిగ్రస్తులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. కళ్లమంట, గొంతునొప్పి, దగ్గు, ముక్కు నుంచి రక్తం రావడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. బూడిద, ధూళి వంటి సూక్ష్మ కణాల వల్ల గుండె, ఊపిరితిత్తి సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు ప్రజలను హెచ్చరించారు.