Khaleda Zia on Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆ దేశ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని ఖలీదా జియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు గృహనిర్బంధం నుంచి విడుదలైన ఖలీదాజియా బంగ్లాదేశ్ ఖిలాఫత్ మజ్లీస్ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ వనరులు వృథా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ దేశం తమదని, దాన్ని నిర్మించుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేయటం తీవ్రమైన విషయమని ఖలీదాజియా పేర్కొన్నారు.
'మా అమ్మ ఎక్కడా ఆశ్రయం కోరలేదు'
మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఏ దేశంలోను ఆశ్రయం కోరలేదని ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం ఆమె వీసాను రద్దు చేసిందంటూ మీడియా కథనాలు వెలువడిన తరుణంలో ఆయన నుంచి ఈ మేరకు స్పందన వచ్చింది. హసీనా ఆశ్రయం విషయంలో యూకే, యూఎస్ ప్రభుత్వాలు స్పందించడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని సాజీబ్ వాజెద్ పేర్కొన్నారు. అలాగే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు.
భారత్‌లోనే ఆశ్రయం
ఇదిలా ఉండగా షేక్ హసీనా మరో రెండ్రోజులపాటైనా భారత్‌లోనే ఆశ్రయం పొందడం అనివార్యమయ్యేలా ఉంది. వాస్తవంగా మన దేశం మీదుగా బ్రిటన్‌కు వెళ్లి అక్కడ తాత్కాలిక ఆశ్రయం పొందాలనేది షేక్ హసీనా ఉద్దేశం. ఇదే విషయాన్ని హిండన్ వైమానిక స్థావరంలో దిగడానికి ముందు ఆమె సన్నిహిత వర్గాలు భారత ప్రభుత్వానికి తెలిపాయి.
ఆమె సోదరి రెహానా కుమార్తె తులిప్ సిద్దీఖ్ బ్రిటన్ పార్లమెంటులో సభ్యురాలు. రెహానాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. దాంతో ఆమె యూకే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హసీనా విషయమై నిన్న బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి వచ్చేందుకు తమ వలస చట్టాలు అంగీకరించవని వెల్లడించారు. ‘‘అవసరంలో ఉన్నవారికి రక్షణ కల్పించే విషయంలో మాకు గొప్ప రికార్డు ఉంది. అంతర్జాతీయ రక్షణ కోరేవారు తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలి’’ అని అన్నారు. మరోవైపు అమెరికా హసీనా వీసా రద్దు చేసిందని వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో దిల్లీలో అజ్ఞాత ప్రదేశంలోనే ఆమె తాత్కాలికంగా తలదాచుకుంటున్నారని సమాచారం. సోదరి షేక్ రెహానాతో కలిసి సైనిక రవాణా విమానంలో సోమవారం మన దేశానికి వచ్చిన హసీనాను పటిష్ఠమైన భద్రత నడుమ ఓ రహస్య ప్రదేశానికి తరలించిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం వీడినట్లు ఇప్పటికే ఆమె కుమారుడు వెల్లడించిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నారని సాజీబ్ వాజెద్ పేర్కొన్నారు. తాజా పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేశాయని అన్నారు. తిరిగి ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ - Yunus as head of Bangladesh govt
'అలా చేస్తే బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుంది' - హసీనా కుమారుడు సంచనల కామెంట్స్! - Bangladesh Crisis