Kamala Harris Rejects Trump's Offer To Shift Presidential Debate :అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 4న ఫాక్స్ న్యూస్ ఛానెల్ ఆధ్వర్యంలో డిబేట్ చేద్దామంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రతిపాదనను, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తిరస్కరించారు. జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే, సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో డిబేట్ చేద్దామని స్పష్టం చేశారు.
"ఎప్పుడైనా, ఎక్కడైనా సరే అని గతంలో వ్యాఖ్యానించిన ఓ వ్యక్తి ఇప్పుడు నిర్దిష్ట తేదీన, నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో డిబేట్ అని ప్రతిపాదిస్తుండటం విచిత్రంగా ఉంది. కొత్త ప్రతిపాదన నాకు ఏమాత్రం అంగీకారం కాదు. సెప్టెంబరు 10న డిబేట్లో పాల్గొనేందుకు ట్రంప్ ముందుగా అంగీకరించారు. నేను అదే తేదీన ట్రంప్‌తో డిబేట్లో పాల్గొంటాను" అని కమలా హారిస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ జూన్‌లో సీఎన్‌ఎన్ ఆధ్వర్యంలో బైడెన్‌తో తొలి డిబేట్లో పాల్గొన్నారు. సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ నిర్వహణలో రెండో డిబేట్లో పాల్గొనాలని వారిద్దరి మధ్య అంగీకారం కుదిరింది. అనూహ్య పరిస్థితుల్లో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడం వల్ల ఆయన స్థానంలో కమలా హారిస్ వచ్చారు. దీనితో సెప్టెంబరు 4న ఫాక్స్ న్యూస్ ఛానెల్ నిర్వహణలో డిబేట్లో పాల్గొందామని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను తాజాగా కమలా హారిస్ తిరస్కరించారు.
అంతా సాఫీగానే
డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి కమలా హారిస్ ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఆమె సభలకు జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. విరాళాలు పెద్దఎత్తున వస్తున్నాయి. అయితే రానున్న వారం రోజులు కమలకు చాలా కీలకం. ఎన్నికల ప్రచారంలో ఇంకా జోరు పెంచాల్సి ఉండటం సహా, ఉపాధ్యక్ష అభ్యర్థిని మంగళవారంలోగా నిర్ణయించాల్సి ఉంటుంది. ఆరుగురు కీలక వ్యక్తులతో (నలుగురు గవర్నర్లు, ఓ సెనెటర్, ఓ కేబినెట్ అధికారి) కూడిన జాబితాలో నుంచి కమల తన నంబర్-2ను ఎంచుకోవాల్సి ఉంటుంది.