తెలంగాణ

telangana

'ట్రంప్‌ను ఓడించడమే నా లక్ష్యం' - కమలా హారిస్ - US Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 8:35 AM IST

Kamala Harris on Trump : డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు అధ్యక్షుడు జో బైడెన్‌కు కమలా హారిస్‌ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడించడమే తన లక్ష్యమని, అందుకోసం దేశాన్ని ఏకం చేస్తానని అన్నారు.

Kamala Harris on Trump
Kamala Harris on Trump (Associated Press)

Kamala Harris on Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​ను ఓడించడమే తన లక్ష్యమని కమలా హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్​ అతివాద 'ప్రాజెక్ట్​ 2025' అజెండాను ఓడించడం కోసం, దేశాన్ని ఏకం చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడెన్​ తన పేరును ప్రతిపాదించడాన్ని కమలా హారిస్ స్వాగతించారు.

'దేశ అధ్యక్షుడిగా అద్భుతమైన సేవలు అందించిన జో బైడెన్‌కు అమెరికా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన ఆయనకు ధన్యవాదాలు. నిజాయితీ, చిత్తశుద్ధి, దేశభక్తి, సహృదయం ఇలాంటి లక్షణాలన్నీ నేను బైడెన్​లో చూశా. ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. ఎన్నికల్లో ఎవరివైపు ఉండాలో ప్రజలకు వివరిస్తున్నా. ఇక అధ్యక్షుడు జో బైడెన్​ నాకు మద్దతు తెలపడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. పార్టీ నామినేషన్‌ను సాధించి, అధ్యక్ష ఎన్నికలల్లో గెలవడమే నా లక్ష్యం. ట్రంప్‌ను ఓడించేలా ఈ దేశాన్ని ఏకం చేసేందుకు కూడా పని చేస్తా. ఎన్నికలకు ఇంకా 107 రోజులు ఉన్నాయి. మనందరం కలిసి పోరాడుదాం. అప్పుడే కచ్చితంగా గెలుస్తాం' అని హారిస్‌ అన్నారు.

కమలా హారిస్​కు అంత ఈజీ కాదు!
బైడెన్​ వైదొలగడం వల్ల అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డెమొక్రాట్లలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బైడెన్‌ మద్దతు తెలిపడం కమలా హారిస్‌కు కలిసొచ్చే అంశమే. అయినప్పటికీ ఆగస్టు 19న షికాగోలో జరిగే డెమొక్రటిక్‌ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధుల ఆమోదం ఆమె పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌ మద్దతు ప్రకటించారు. భారత సంతతికి చెందిన డెమొక్రటిక్‌ నేతలు ప్రమీలా జయపాల్‌, అశ్విన్ రామస్వామి సైతం కమలా హారిస్‌కు మద్దతుగా నిలిచారు.

'కమలా హారిస్​ను సులభంగా ఓడిస్తా'
దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే, అది బైడెన్‌ మాత్రమే అని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ విమర్శించారు. డెమొక్రటిక్‌ నామినీగా బైడెన్‌ వైదొలిగిన అనంతరం ట్రంప్ ఈ విధంగా స్పందించారు. కమలా హారిస్‌ అధ్యక్ష అభ్యర్థి అయితే తాను ఆమెను మరింత సులభంగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

విశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి విజయం

బంగ్లాదేశ్​లో విద్యార్థులకు అనుకూలంగా సుప్రీం తీర్పు- 30% రిజర్వేషన్లు 7శాతానికి తగ్గింపు - Bangladesh Reservation Issue

ABOUT THE AUTHOR

...view details