Kamala Harris on US Polls Results : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నానని, పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని కమలా హారిస్ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫలితాలపై ఆమె తొలిసారి స్పందించారు. వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందన్నారు. అయితే, దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని తెలిపారు.
'ఇది ఆశించిన ఫలితం కాదు. దీని కోసం మనం పోరాడలేదు. కానీ దీన్ని అంగీకరించాల్సిందే. ఎన్నికల్లో పోటీపడిన తీరుపై గర్వంగా ఉంది. దేశం పట్ల ప్రేమ, సంకల్పంతోపాటు మీరు నాపై ఉంచిన నమ్మకంతో నా హృదయం నిండిపోయింది. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, సమాన న్యాయం కోసం పోరుబాటను ఎప్పటికీ వీడను. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుంది. దానర్థం గెలవలేమని కాదు' అని కమలా హారిస్ తన మద్దతుదారులను ఉద్దేశించి కమల ప్రసంగించారు.
ట్రంపనకు శుభాకాంక్షలు
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు కమలా హారిస్ తెలిపారు. అధికార మార్పిడి శాంతియుతంగా సాగేలా ఆయనకు, ఆయన బృందానికి సాయం చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అమెరికాలో అధ్యక్షుడికి లేదా పార్టీకి కాకుండా రాజ్యాంగానికి, మనస్సాక్షికి, దేవుడికి విధేయత చూపుతారని గుర్తుచేశారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదేనని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
కమలా ప్రజా సేవకురాలు
డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. హారిస్ తన పోరాటాన్ని కొనసాగిస్తారన్నారు. అసాధారణ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా వచ్చి చరిత్రాత్మకమైన ప్రచారానికి నాయకత్వం వహించారని కొనియాడారు. ఆమె చాలా ధైర్యం నిండిన ప్రజా సేవకురాలని, అమెరికన్లందరికీ స్వేచ్ఛ, న్యాయం, మరిన్ని అవకాశాలు రావాలని బలంగా కోరుకున్నారు. 2020 ఎన్నికల్లో తను అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడు హారిస్‌పై నమ్మకంతోనే ఉపాధ్యక్షురాలిగా ఎంచుకున్నానని తెలిపారు. హారిస్ చెప్పినట్లు తన బాధ్యతను కొనసాగిస్తుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. హారిస్ సంకల్పంతో ఆనందంగా పోరాటాన్ని సాగిస్తుందని అమెరికన్లందరికీ ఛాంపియన్‌గా నిలుస్తుందని అని బైడెన్ ఎక్స్ వేదికగా తెలిపారు.
భారీ విజయం దిశగా ట్రంప్
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సొంతం చేసుకునే దిశగా సాగుతున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు సాధారణ మెజార్టీ 270 కాగా, ఇప్పటికే 295 దక్కించుకున్న ఆయన మరో 17 ఓట్లు ఉన్న నెవడా, ఆరిజోనా రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి కమలా హారిస్ 226 ఓట్లకు పరిమితమయ్యారు. సెనెట్, ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించే దిశలో పయనిస్తోంది.