Israel Soldiers Killed In Gaza :గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలకు భారీ షాక్ తగిలింది. సెంట్రల్ గాజాలో జరిగిన దాడిలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మొదలైన తర్వాత ఓ దాడిలో అత్యధిక మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి.
ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ఈ మేరకు వెల్లడించారు. రెండు భవనాలను పేల్చేసేందుకు ఇజ్రాయెల్ సైనికులు ప్రయత్నిస్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పారు. 'ఇజ్రాయెల్ సైనికులు భవనాలకు పేలుడు పదార్థాలు అమర్చుతున్నారు. అదే సమయంలో ఓ మిలిటెంట్ సైనికులకు దగ్గర్లోని ఓ యుద్ధ ట్యాంకుపై రాకెట్ ప్రొపెలెంట్ గ్రెనేడ్‌తో దాడి చేశాడు. దీంతో అనుకున్న సమయానికి ముందే పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అయిపోయాయి. ఆ రెండు భవనాలు సైనికులపై కుప్పకూలాయి' అని డేనియల్ వివరించారు.
"సరిహద్దుకు 600 మీటర్ల దూరంలో సైనికులు పని చేస్తున్నారు. హమాస్‌కు చెందిన నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఉగ్రవాదులు మా భద్రతా బలగాల ట్యాంకుపై ఆర్పీజీని ప్రయోగించారు. ఈ పేలుడు ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. ఆ సమయంలో సైనికులు భవనం లోపల, భవనానికి దగ్గరగా ఉన్నారు. భవనాన్ని ధ్వంసం చేసేందుకు మా సైనికులు పెట్టిన మైన్ల వల్లే పేలుడు సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నాం. కానీ, కారణాన్ని నిర్ధరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నాం."
-రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ, ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి
రక్షణ మంత్రి విచారం
సైనికుల మరణం అత్యంత బాధాకరమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైనికుల త్యాగాల నేపథ్యంలో యుద్ధంలో తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి మరింత దూకుడుతో ముందుకెళ్తామని అన్నారు. ఇజ్రాయెల్ ప్రజల భవిష్యత్‌ను ఈ యుద్ధమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.