Israel Iran War News Updates :ఇజ్రాయెల్ గురువారం లెబనాన్‌లోని సెంట్రల్ బీరుట్‌పై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది మరణించగా, 117 మంది తీవ్రంగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన హెజ్‌బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని సమాచారం.
పశ్చిమ బీరుట్‌లోని వేర్వేరు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో రెండు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయి. దీనితో అక్కడి వాతావరణం భీతవహంగా మారింది.
పీస్కీపర్స్పై దాడి
మరోవైపు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయంపై కూడా ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పీస్‌కీపర్స్ గాయపడినట్లు తెలుస్తోంది. యూఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణమంత్రి గైడో క్రోసెట్టో తీవ్రంగా ఖండించారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ దాడులపై వాషింగ్టన్ సైతం స్పందించింది. హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో, యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో యూఎన్ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని యూఎన్ సూచించింది.