Israel Hezbollah Latest News :ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్షిపణి దాడులు చేశారు. దాదాపు 20 క్షిపణులను హెజ్‌బొల్లా ప్రయోగించగా అందులో ఒకటి వైమానిక నిర్వహణ వ్యవస్థకు సమీపంలో పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మిగిలిన వాటిలో కొన్నింటిని కూల్చేశామని, మరికొన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడ్డాయని వెల్లడించింది. ప్రతీకారంగా లెబనాన్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని పేర్కొంది. తాము ఇజ్రాయెల్‌లోని మెరోన్ వైమానిక నిర్వహణ వ్యవస్థపై క్షిపణితో దాడి చేశామని హెజ్‌బొల్లా ప్రకటించింది. మరో దాడితో సాంకేతిక పరికరాలను ధ్వంసం చేశామని తెలిపింది.
గాజాలో ఆకలి కేకలు
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మొత్తం 23 లక్షల మందిలో 5,76,000 మంది తీవ్ర క్షుద్బాధతో అలమటిస్తున్నారు. రెండేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ ప్రతినిధి రమేశ్ రామసింగం తెలిపారు. మిగిలిన వారూ సరైన ఆహారం దొరక్క అలమటిస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఉత్తర గాజాకు ఫుడ్ వ్యాన్లు
ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న ట్రక్కులు ఉత్తర గాజాకు చేరుకున్నాయని ఇజ్రాయెల్ అధికారులు బుధవారం తెలిపారు. యుద్ధంతో తీవ్రంగా ప్రభామితమైన గాజాకు ఆహార పదార్థాలు చేరుకోవడం గతకొన్ని వారాల్లో ఇదే తొలిసారి. మరోవైపు, జోర్డాన్, యూఏఈ, ఈజిప్టు, ఫ్రాన్స్ నుంచి వచ్చిన విమానాల ద్వారా మంగళవారం గాజాలో ఆహార పొట్లాలను జారవిడిచామని జోర్డాన్ వెల్లడించింది.