Israel Hamas War Latest Update :గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ బలగాలు దాడులు మరింత తీవ్రం చేస్తున్నాయి. గురువారం ఇజ్రాయెల్ సేనలు జరిపిన వైమానిక, భూతల దాడుల్లో 100 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడింట రెండొంతులు మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. వందలాది మంది గాయపడ్డారని, చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. దక్షిణ గాజాలోని రఫా నగరం, మధ్య గాజాలోని దెయిర్ అల్ బలాహ్, నుస్సేరత్ శరణార్థి శిబిరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ బాంబులతో విరుచుకుపడింది.
మృతదేహాలతో నిండిన ఆస్పత్రి!
దాడుల కారణంగా మృతదేహాలు, క్షతగాత్రులతో అల్ అక్సా ఆస్పత్రి నిండిపోయింది. అటు గాజాలో హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్ యుద్ధంతో సంబంధం లేని పాలస్తీనా భూభాగమైన వెస్ట్ బ్యాంక్‌లో సెటిల్ మెంట్లను పెంచుకుంటోంది. వెస్ట్ బ్యాంక్‌లో 3,300 కొత్త ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ నిర్ణయాన్ని అమెరికా ఖండించింది. కొత్త ఆక్రమణలు చేయవద్దని, గతంలోనే ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేసింది.
'మా నియంత్రణలోనే గాజా'
అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం కీలక పత్రాన్ని తన వార్ కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత గాజాను ఎలా నియంత్రించాలన్న ప్రణాళికను ఆ పత్రంలో వివరించారు. గాజాను నిస్సైనికీకరణ చేస్తామని, భద్రతతో పాటు పాలనా వ్యవహారాలను కూడా తమ చేతుల్లో తీసుకుంటామని పేర్కొన్నారు. వెస్ట్ బ్యాంక్, గాజా సహా జోర్డాన్ పశ్చిమభాగంలో భద్రతా నియంత్రణ మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంటుందని ప్రతిపాదించారు.