Israel Hamas War Gaza Death Toll :గత ఏడాదిగా ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. గత రెండు రోజులుగా ఆస్పత్రులకు వచ్చిన మృతుదేహాలతో మృతుల సంఖ్య 43,020వేలకు చేరిందని చెప్పింది. ఈ యుద్ధం మొదలైన 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు.
గాజా ఆస్పత్రి భూగర్భంలో 100మంది హమాస్ మిలిటెంట్లు
గాజా స్ట్రిప్‌లోని ఓ ఆస్పత్రి భూగర్భంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దృశ్యాలను ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది. హమాస్ మిలిటెంట్ల గాలింపులో భాగంగా గాజా స్ట్రిప్‌లోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ భద్రతా దళం-ఐడీఎఫ్ తెలిపింది. అక్కడ జరిగిన సోదాల్లో ఆస్పత్రి భూగర్భంలో భారీగా ఆయుధాలు లభించినట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలో సుమారు 100 మంది హమాస్ మిలిటెంట్లను బంధించినట్లు తెలిపింది. పౌరుల తరలింపు సమయంలో వారిలో కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది. కమల్ అద్వాన్‌లోని 88 మంది రోగులను, వారి సంరక్షకులను, సిబ్బందిని గాజా స్ట్రిప్‌లోని వేరే ఆస్పత్రికి తరలించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులు చట్టవిరుద్ధమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ హుస్సేన్ సలామీ అన్నారు. ఈ దాడులు చేసిన వారి ఊహలకు అందని పర్యవసనాలు ఉంటాయని హెచ్చరించారు.