తెలంగాణ

telangana

ETV Bharat / international

7 నెలల కాల్పుల విరమణకు హమాస్​ ఓకే- రఫాపై దాడి ప్రకటన వెంటనే అంగీకారం - israel hamas ceasefire

Israel Hamas Ceasefire :ఇజ్రాయెల్​తో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది హమాస్. ఈజిప్ట్​, ఖతార్​ దేశాలు చేసిన ప్రతిపాదనకు అంగీకరించినట్లు అగ్రనేత తెలిపారు.

Israel Hamas Ceasefire
Israel Hamas Ceasefire (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 10:34 PM IST

Updated : May 6, 2024, 10:52 PM IST

Israel Hamas Ceasefire : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు ఈజిప్టు, ఖతార్‌ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇజ్రాయెల్​తో యుద్ధంలో ఏడు నెలల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు హమాస్​ అంగీకరించింది. ఈ మేరకు హమాస్​ అగ్రనేత ఇస్మాయిల్​ హనియా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ విషయాన్ని ఖతార్​ ప్రధానమంత్రికి, ఈజిప్ట్​ హోంమంత్రికి తెలిపినట్లు వివరించారు. ఈ రెండు దేశాలు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కాగా హమాస్​ ప్రకటనపై ఇజ్రాయెల్​ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, రఫా నుంచి పాలస్తీనియన్లు ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్​ ప్రకటించిన గంటల్లోనే విరమణకు అంగీకరించింది హమాస్​. అంతకుముందు గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ దళాలు చేసిన వైమానిక దాడిలో రఫాలోని 22 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు నవజాతి శిశువులు సహా పలువురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఇజ్రాయెల్‌లోని ప్రధాన క్రాసింగ్‌ పాయింట్‌పై హమాస్‌ జరిపిన దాడికి ప్రతీకారంగా ప్రతీదాడి చేసినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. దాదాపు లక్ష మంది పాలస్తీనా వాసులు రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌ దళాలు దాడులు ప్రారంభించింది. అంతకుముందు హమాస్‌ జరిపిన దాడిలో తమ సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది.

ఇజ్రాయెల్​- హమాస్​ పోరులో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రూ.లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది పొట్టచేతపట్టుకొని సాయం కోసం అర్థిస్తున్నారని ఇప్పటికే పలుసార్లు ఐరాస తెలిపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నరమేధానికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌లోని ఓ విభాగంపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. కొన్ని సంస్థలు, వ్యక్తులపైనా చర్యలకు ఉపక్రమించింది. రఫాలోనూ భూతల దాడులకు పాల్పడితే తమ సహకారం ఉండబోదని హెచ్చరించింది. బ్రిటన్‌ సైతం పలు సందర్భాల్లో ఈ తరహా హెచ్చరికలు చేసింది.

Last Updated : May 6, 2024, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details