Israel Direct Attack On Hezbollah Bases : లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హెజ్‌బొల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) వెల్లడించింది. హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగం వేళ ఇజ్రాయెల్ ఈ ప్రత్యక్ష దాడులకు పాల్పడడం గమనార్హం.
దశాబ్దాలుగా హెజ్‌బొల్లా సంస్థ, సాధారణ పౌరుల గృహాలను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అలాగే, పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించి, దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని ఐడీఎఫ్ ఆరోపించింది.
4000 మందిని చంపే కుట్ర : హెజ్‌బొల్లా చీఫ్
మరోవైపు పేజర్ల పేలుళ్ల ఘటనను హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా తీవ్రంగా ఖండించారు. వీటిని యుద్ధ నేరాలు, యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తున్నామన్నారు. దాదాపు నాలుగు వేల పేజర్లను లక్ష్యంగా చేసుకున్నారని, దీని ద్వారా 4000 మందిని ఏకకాలంలో చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. రెండో రోజు దాడిలో వాకీటాకీలు పేల్చి, మరో వెయ్యి మందిని హతమార్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తముందని, ఇవి ఊచకోతలేనన్నారు.
ప్రతీకారం తీర్చుకుంటాం!
పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అట్టుడికిన నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. గాజాకు పరిమితమైన యుద్ధం లెబనాన్‌కూ విస్తరించనుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటివరకు హమాస్‌పై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్, ఇప్పుడు హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా గురువారం టెలివిజన్‌లో ప్రసంగించారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్ హద్దు మీరిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడటం గమనార్హం. అంతకుముందు హెజ్‌బొల్లా డ్రోన్ దాడులు చేసింది. ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెబనాన్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. దాదాపు 3 వేల మందికి గాయాలైనట్లు, ఇందులో 287 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
పేజర్లు, వాకీటాకీలపై నిషేధం
పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది.
'యుద్ధం కొత్త దశ షురూ!' లెబనాన్‌లో పేలుళ్ల వేళ ఇజ్రాయెల్ ప్రకటన - Israel Lebanon War
రెండేళ్ల పక్కా ప్లానింగ్- వందల పేజర్లు ఒకేసారి ఢమాల్! లెబనాన్ దాడి వెనుక ఇంత స్కెచ్ ఉందా? - Lebanon Pager Explosion