Israel Attacks Lebanon :పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్రరూపుదాల్చాయి. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై వరుస క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపుదాడి చేసింది. వంద యుద్ధ విమానాలు, 40 రాకెట్లు, క్షిపణులతో హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధ్రువీకరించాయి. హెజ్‌బొల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని దీన్ని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
100 యుద్ధ విమానాలు లెబనాన్‌లోకి!
దాదాపు 6 వేల రాకెట్లు, డ్రోన్లతో హెజ్‌బొల్లా దాడికి సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆత్మ రక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 7 ఘటనకు మించి అతిభారీ విధ్వంసానికి సిద్ధమైన హెజ్‌బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ సైన్యానికి చెందిన 100 యుద్ధ విమానాలు లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి అనేక రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. తమపై దాడి చేసే వారిపై ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దేశాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
320 కత్యూషా రాకెట్ల ప్రయోగం!
దాదాపు 200 హెజ్‌బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల వెల్లడించాయి. ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ఉగ్రవాద ముఠా విస్తృత స్థాయి దాడికి సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారీ హెచ్చరించివ కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్‌లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. అటు తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు పేర్కొంటూ లెబనాన్‌లోని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న తరుణంలో తమ పౌరులను లెబనాన్ అప్రమత్తం చేసింది. హెజ్‌బొల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ ప్రతిదాడులు చేసింది. 11 ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. బీరుట్‌లో తమ కమాండర్ ఫాద్ షుక్ర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడులు చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది.