Iran And Hezbollah Attack On Israel :హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియాపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా దాడిచేసే అవకాశాలు ఉన్నాయి. బహుశా 24 నుంచి 48 గంటల్లో ఈ దాడి జరిగవచ్చని అమెరికా, ఇజ్రాయెల్, జీ-7 దేశాలు అంచనావేస్తున్నాయి. దాడిని దీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశం అమెరికా సర్వశక్తులూ కూడగడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపిన అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి సైనిక వ్యూహాలు పన్నుతోంది.
దాడి జరిగే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్, అమెరికా దేశాల అగ్రశ్రేణి కమాండర్లు సోమవారం టెల్‌అవీవ్‌లో సమావేశమై చర్చలు జరిపారు. అటు తాజా పరిస్థితులపై జీ-7 దేశాల మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని నేతలను కోరారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్, హెజ్‌బొల్లా ఏ క్షణంలోనైనా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని నేతలకు వివరించారు. దాడులు కచ్చితంగా ఎప్పుడూ ఉండొచ్చనేది మాత్రం తెలియదన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా చల్లబర్చాల్సిన అవసరం ఉందని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పొరుగుదేశాలకు దాడి గురించిన సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దాడిపై స్పష్టమైన సమాచారం అందితే, అవసరమైతే తామే ముందుగా ఇరాన్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.