US China Trade War Impact On India :అమెరికా-చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం భారత్‌కు భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ ఎగుమతిదారులకు కాసుల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిణామాలను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనా ఉత్పత్తులకు దీటుగా, నాణ్యతగా వస్తు తయారీపై దృష్టి పెడితే పరిణామాలు భారత్‌కు అనుకూలంగా మారతాయని విశ్లేషిస్తున్నారు.
తొలిసారే 4వ స్థానంలో భారత్
ఈ వాణిజ్య యుద్ధ పరిణామాలు భారత్‌కు లబ్ధి చేకూరుస్తాయన్న అంచనాలు మొదలయ్యాయి. అమెరికా విపణిలోకి భారతీయ ఎక్స్‌పోర్టర్ల షిప్‌మెంట్‌లు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ట్రంప్ ఇలాగే చైనా నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించగా, అప్పుడు భారీగా లాభపడిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉందని గణాంకాలు తెలిపాయి. తాజాగా ట్రంప్ చైనా దిగుమతులపై 10శాతం టారిఫ్‌లు విధించడం మళ్లీ భారతీయ ఎగుమతిదారులకు లాభాలు తెచ్చిపెడుతుందని సమాచారం.
చైనా వస్తువులకు పోటీ తక్కువ
ట్రంప్ అధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లోకి పంపే తమ ఉత్పత్తులకు చైనా సంస్థలు ధరలను పెంచాల్సి ఉంటుంది. చైనా ఉత్పత్తులకు ధరలు పెరగడం వల్ల మార్కెట్‌లో వాటి పోటీ తగ్గుతుంది. అధిక భారాన్ని భరించలేని అమెరికన్లు ఇతర దేశాల ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. ఇది భారత ఎగుమతిదారులకు ప్రయోజనాలను చేకూరుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనేజేషన్స్(FIEO) తెలిపింది. ప్రయోజనాలు భారీ స్థాయిలో ఉండాలంటే భారత ఉత్పత్తి సామర్థ్యం పెరగాలని, ఇతర దేశాల ఉత్పత్తులకు పోటీపడే స్థాయిలో మన వస్తువులు ఉండాలని వెల్లడించింది.
ఆ రంగాలకే ఎక్కువ బెనిఫిట్
అమెరికాకు మనం ఎగుమతి చేసేవాటిలో విద్యుత్ యంత్రాలు, వాటి విడిభాగాలు, ఆటో కాంపోనెంట్స్, అసెంబుల్ అయిన మొబైల్స్, ఔషధాలు, రసాయనాలు, దుస్తులు, వస్త్రాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి. చైనాపై 10శాతం సుంకం నిర్ణయం వల్ల ఇప్పుడు ఆ రంగాలకే ఎక్కువగా లబ్ధి చేకూరనుందని అంచనాలు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య భారత్‌కు అమెరికా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అప్పుడు ఇరు దేశాల మధ్య 82.52 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. అందులో 52.89 బిలియన్ల డాలర్ల ఎగుమతులు, 29.63 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయని ఎప్ఐఈఓ తెలిపింది. 2021-24 మధ్య అమెరికా భారత్‌కు అతిపెద్ద ట్రేడ్ పార్ట్‌నర్‌గా ఉంది.