India Republic Day 2024 :75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్‌కు ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు చెప్పాయి. భారత్‌తో అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా అమెరికా తెలిపింది. గతేడాది కాలంగా ఇరుదేశాల బంధం అనేక మైలురాళ్లను దాటిందని పేర్కొంది. జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని గుర్తు చేసింది. ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత పెంపొందించే దిశగా పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపింది. భారత్-అమెరికా బంధాన్ని ప్రపంచంలోనే అత్యంత కీలకమైనదిగా అభివర్ణించింది.
"భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌కు ఆ దేశ రాజ్యాంగం బలమైన పునాది ఏర్పరచింది. ప్రపంచ స్థాయిలో నాయకత్వం వహించే దేశంగా భారత్‌కు రాజ్యాంగం మార్గనిర్దేశం చేస్తుంది. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్‌తో అనేక రంగాల్లో సహకారం పెంపొందించుకునే దిశగా పని చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పర్యటనలో ఈ విషయం స్పష్టమైంది."
-అమెరికా విదేశాంగ శాఖ
రష్యా స్పెషల్ విషెస్
భారత స్నేహితులకు శుభాకాంక్షలంటూ రష్యా ట్వీట్ చేసింది. భారత్ అభివృద్ధి మరింత వేగంగా సాగాలంటూ అభిలాషించింది. ప్రకాశవంతమైన అమృతకాలం భారత్ కోసం ఎదురుచూస్తోందని భారత్లోని రష్యా రాయబారి డెన్నిక్ అలిపోవ్ పేర్కొన్నారు. 'రష్యా- భారతీయ దోస్తీ' సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. దీంతో పాటు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ బాలీవుడ్ చిత్రం గదర్లోని ఓ పాటకు భారత్లోని తమ రాయబారులు డ్యాన్స్ చేస్తున్న వీడియోను రష్యా పంచుకుంది. భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని అధికారులు, ప్రజలు డ్యాన్స్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది.