India on Tensions in West Asia : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత దేశాలు అన్ని వైపులా నుంచి సంయమనం పాటించాలని భారత్ పిలుపునిచ్చింది. చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉండగా లెబనాన్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తాజాగా దక్షిణ గాజాపై దాడులకు దిగింది. ఈ ఘటనలో 51 మంది మరణించారు. మరోవైపు హెజ్‌బొల్లా స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్, లెబనాన్‌లోని సరిహద్దు గ్రామాలు ఖాళీ చేయిస్తోంది.
ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు
పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత్ పేర్కొంది. పౌరుల రక్షణ కోసం మా పిలుపును పునరుద్ఘాటిస్తున్నామని ప్రకటనలో తెలిపింది. సంబంధిత వ్యక్తులందరూ దౌత్యం, చర్చలు ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపింది. అక్కడి భద్రతా పరిస్థిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు చేయొద్దని, దేశ పౌరులకు సూచించింది. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని , సహాయం కోసం టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించకూడదని ఆశిస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు దిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.
'ఆ గ్రామాలను ఖాళీ చేయండి'
దక్షిణ లెబనాన్‌లోని 24 గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాది హమాస్ తరహాలో దాడి జరగకుండా హెజ్‌బొల్లా ఉగ్రవాదులను అడ్డుకోవడమే లక్ష్యంగా పరిమిత స్థాయిలో సైనిక చర్య చేపట్టినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇందుకోసం ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్‌లో ప్రవేశించి ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. ఈ క్రమంలో ఆ గ్రామాలను ఖాళీ చేయాలని ప్రజలకు సూచించింది. అయితే, ఆ గ్రామాలు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయి. 2006లో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణల తర్వాత ఐక్యరాజ్యసమితి ఈ గ్రామాలను బఫర్‌జోన్‌గా ఏర్పాటు చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి
లెబనాన్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోవైపు దక్షిణ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ వైమానిక దాడుల్లో 51 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రికి తరలించి చిక్సిత అందిస్తుమని, కొంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఖాన్ యూనిస్‌లో బుధవారం తెల్లవారుజూమున 3 గంటలకు ఈ దాడి జరిగిందని చెప్పారు. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ ఇంకా ధ్రువీకరించలేదు.
నెతన్యాహుకు మోదీ న్యూయర్ విషెస్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలను ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.