India Maldives Issue : భారత్‌కు దూరం జరుగుతూ చైనాకు దగ్గరయ్యే విధానం అవలంభిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముయిజ్జు తీరుపై ఆ దేశ ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దశాబ్దాలుగా మిత్ర దేశంగా ఉన్న భారత్‌తో వివాదం మాల్దీవుల అభివృద్ధికే చేటు చేస్తుందంటూ అక్కడి ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. చైనాకు చెందిన పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన తరుణంలో ప్రతిపక్షాలు ఈ హెచ్చరికలు చేశాయి. మాల్దీవుల అభివృద్ధిలో సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్న మిత్రులను దూరం చేసుకోవడం దేశానికే హానికరం అంటూ మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ, ది డెమొక్రాట్స్ నేతలు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జును హెచ్చరించారు.
ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పనిచేయాలంటూ ప్రతిపక్షాలు ముయిజ్జు ప్రభుత్వానికి సూచించాయి. హిందూ మహా సముద్రంలో శాంతి, సుస్థిరత మాల్దీవుల భద్రతకు చాలా కీలకమని గుర్తుచేశాయి. మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ ఫయాజ్ ఇస్మాయిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ సలీమ్, డెమొక్రాట్స్ అధిపతి హసన్ లతీఫ్, పార్లమెంటరీ గ్రూప్ నేత అలీ అజీమ్ ఇటీవల నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ముయిజ్జు తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
మార్చి 15కల్లా తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఇటీవల తుది గడువు విధించటం వల్ల వివాదం మొదలైంది. భారత సేన వెనక్కి తిరిగి వస్తే ఆ స్థానంలో చైనా దళాలు ప్రవేశించే అవకాశం ఉంది. లక్షద్వీప్‌లో భారత ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడం వల్ల వివాదం ముదిరింది. చైనా పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించడంపైనా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.