Modi Kuwait Visit :కువైట్‌కు అవసరమైన మానవ వనరులు, నైపుణ్యాలు, సాంకేతికతను అందించడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కువైట్ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని తెలిపారు. భారత్ స్టార్టప్‌లు, కువైట్ అవసరాలకు అత్యాధునిక పరిష్కారాలను చూపించగలవని అన్నారు. కువైట్‌లో హాలా మోదీ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, తన కువైట్ పర్యటన రెండు దేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని ప్రవాస భారతీయులను కొనియాడారు. భారత్ నుంచి కువైట్‌కు చేరుకునేందుకు నాలుగు గంటల సమయం పడితే, ఒక భారత ప్రధాని కువైట్‌కు రావడానికి నాలుగు దశాబ్దాలు పట్టిందని మోదీ చెప్పారు.
"43 సంవత్సరాల క్రితం భారత ప్రధాని కువైట్‌కు వచ్చారు. మీకు భారత్ నుంచి ఇక్కడి రావడానికి 4 గంటలు పడుతుంది. ప్రధానమంత్రి రావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. వాణిజ్యం, ఆవిష్కరణ ద్వారా కువైట్ క్రియాశీల ఆర్థిక వ్యవస్థగా ఉండాలనుకుంటుంది. భారత్ కూడా ఆవిష్కరణలపై, ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టిసారిస్తుంది. న్యూ కువైట్ నిర్మాణానికి కావాల్సిన కొత్త ఆలోచనలు, స్టీల్, సాంకేతికత, మానవ వనరులు భారత్ వద్ద ఉన్నాయి. భారత్‌లోని ప్రతిభావంతమైన యువత కువైట్ భవిష్యత్తు ప్రయాణంలో కొత్త శక్తిని ఇస్తారు"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కువైట్ మినీ ఇండియా!
పశ్చిమాసియా దేశమైన కువైట్‌లో ఇంత మంది భారతీయులను చూడటం చాలా ఆనందంగా ఉందని, ఇదో మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఏటా వందలాది మంది భారతీయులు ఇక్కడికి వస్తున్నారని, అలా కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని మోదీ అన్నారు. భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను భారతీయ నైపుణ్య రంగులతో నింపారని ప్రశంసించారు. భారతదేశ స్టార్టప్‌లు, సాంకేతికతలు కువైట్ అవసరాలకు ఆధునిక పరిష్కారాలను చూపించగలవని మోదీ అన్నారు. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో భారత్‌కు లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేసిన కువైట్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు రెండు రోజుల పర్యటన కోసం కువైట్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రవాస భారతీయులు ప్రధానికి స్వాగతం పలికారు. అందరినీ మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తాను ఇచ్చిన మాట ప్రకారం 101 ఏళ్ల మంగళ్ సేన్ హండా అనే మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని కలిశారు. మంగళ్ సేన్ హండాను కలవాలంటూ ఎక్స్ వేదికగా ఆయన మనవరాలు చేసిన అభ్యర్థనను అంగీకరించిన మోదీ, కువైట్‌కు చేరుకున్న అనంతరం ఆయనతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు.
చారిత్రక సంబంధం ఎంతో విలువైనది!
కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జబార్ అల్-సబా ఆహ్వానం మేరకు వెళ్లినట్లు ప్రధాని మోదీ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇరుదేశాల మధ్య భవిష్యత్తు భాగస్వామ్యానికి సంబంధించిన రోడ్ మ్యాప్ రూపొందించటానికి ఈ పర్యటన ఓ మంచి అవకాశమని పేర్కొన్నారు. కువైట్‌తో తరతరాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధం ఎంతో విలువైనదని అన్నారు. వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వాములమే కాకుండా పశ్చిమాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం, శ్రేయస్సును భారత్ -కువైట్ కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.