India Canada News Updates :కెనడా వరుస కవ్వింపు చర్యలతో భారత్‌ను విసిగిస్తోంది. దీనితోఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. తాజాగా భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తర్వాత భారత్ నుంచి తమకు సైబర్ ముప్పు పొంచి ఉంచి ఉన్నట్లు ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్ తమపై గూఢచర్యానికి పాల్పడుతోందని పేర్కొంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై ఆ దేశానికి చెందిన ఓ మంత్రి అసంబద్ధ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ట్రూడో సర్కార్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. అయితే దీనిని భారత్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. భారత్ కీర్తి ప్రతిష్ఠలను మసకబార్చాలనే తప్పుడు ఉద్దేశంతోనే కెనడా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఘాటుగా విమర్శించింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కెనడా తీరును ఎండగట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్‌పై కెనడా నిందలు మోపుతోందని మండిపడ్డారు.