Sino Indian Boarder Dispute :భారత్, చైనా సరిహద్ద ప్రాంతాల్లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి జరుగుతోన్న చర్చలు కొంత మేర సఫలమయ్యాయి. వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్ద ప్రాంతాల వెంబడి గస్తీ నిర్వహణను పునఃప్రాంరభించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి మళ్లీ గస్తీ నిర్వహించే అంశంపై ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ ఒప్పందం బలగాల ఉపసంహరణ, 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ, జిన్‌పింగ్ భేటీ
దెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహణకు ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దువివాదాల పరిష్కారాల కోసం గతకొద్ది వారాలుగా జరుగుతోన్న చర్చల ఫలితంగా ఈ పురోగతి చోటుచేసుకుందని మిస్రీ అన్నారు. ఈ ఒప్పందం బలగాల ఉపసంహరణ 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని మిస్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ, రేపు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
"గత కొన్ని వారాలుగా భారత్, చైనా దేశాల దౌత్యవేత్తలు, సైనిక సంధానకర్తలు అనేక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల ఫలితంగా భారత్-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ పునఃప్రాంభంపై ఇరు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. బలగాల ఉపసంహరణ, 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది. మేము దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటాం."
- విక్రమ్ మిస్రీ, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి
గల్వాన్‌లో ఘర్షణ
2020లో భారత్-చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఆ పోరులో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఐదుగురు చనిపోయినట్లు చైనా అధికారికంగా తెలిపింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. భారత్ దాదాపు 68,000 మంది సైనికులను సరిహద్దుకు తరలించింది. ఏదైనా ఊహించని పరిణామాలు ఎదురైతే దీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం అన్నివిధాలా సిద్ధమైంది. అయితే, వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ఈ ప్రతిష్టంభనపై ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు అనేక దఫాల్లో చర్చల్లో పురోగతి కనిపించడంతో పరిస్థితులు కొంతమేర కుదుటపడినట్లు కనిపిస్తోంది.