Hardeep Singh Nijjar Death Video : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన 9 నెలలు తర్వాత అందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో దుండగులు నిజ్జర్ వాహనాన్ని అడ్డగించి తూటాల వర్షం కురిపించినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారాయని కెనడాకు చెందిన సీబీసీ న్యూస్ వెల్లడించింది.
2023 జులై 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆరుగురు వ్యక్తులు రెండు వాహనాల్లో వచ్చి చంపినట్లు ఉంది. నిజ్జర్ తన గ్రేకలర్ పికప్ ట్రక్‌లో గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా ఓ సెడాన్ వేగంగా వచ్చి అడ్డగించింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి తూటాల వర్షం కురిపించారు. అనంతరం మరో కారులో అక్కడి నుంచి పారిపోయినట్లుగా ఆ దృశ్యాల్లో కనిపించింది.
ఇండియా, కెనడా మధ్య విభేదాలు
ఈ ఘటనపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. ఎలాంటి అనుమానితులను కూడా గుర్తించలేదు. అయితే గతంలో ఈ ఫుటేజీ గురించి అమెరికా మీడియా కూడా కథనాలు ప్రచురించింది. నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించారు. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది.