Hafiz Saeed Political Party :ఈనెల 8న పాకిస్థాన్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ మర‌్కజీ ముస్లిం లీగ్ పోటీ చేయనుంది. దీనిని ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సారథ్యంలోని నిషేధిత గ్రూప్‌లకు చెందిన కొత్త పార్టీగా భావిస్తున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు హఫీజ్ సయీద్ బంధువులు లేదా నిషేధిత లష్కరే తోయిబా, జమాత్-ఉద్-దవా, మిల్లీ ముస్లిం లీగ్‌తో సంబంధాలు కలిగినవారేనని బీబీసీ ఉర్దూ ఓ కథనం ప్రచురించింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన కొత్త పార్టీ- మర‌్కజీ ముస్లిం లీగ్ హఫీజ్ సయీద్ జేయూడీకి చెందినదిగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనిని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఖండించారు. సయీద్‌కు చెందిన గ్రూప్‌లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
బరిలో సయీద్ కుమారుడు, అల్లుడు!
సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ మర్కాజీ ముస్లిం లీగ్ పార్టీ నుంచి లాహోర్‌లోని నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-122 నుంచి ఎన్నికల బరిలో పాల్గొంటున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, ఇదే నియోజకవర్గం నుంచి పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత, మాజీ మంత్రి నవాజ్ ఖవాజా సాద్ రఫీక్ పోటీ చేస్తున్నారు. ఇక ఇదే పార్టీ టికెట్‌పై సయీద్ అల్లుడు హఫీజ్ నెక్ గుజ్జర్ మర్కజీ, ప్రావిన్షియల్ అసెంబ్లీ నియోజకవర్గం PP-162 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ముంబయి ఉగ్రదాడి ఇలా!
2008, నవంబర్ 26న పాకిస్థాన్‌కు చెందిన మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబయిలోకి ప్రవేశించి పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 166 ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికసాయం సహా అనేక కేసుల్లో హఫీజ్ సయీద్‌ను దోషిగా తేల్చిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టులు, ఆయనకు 31ఏళ్ల జైలుశిక్ష విధించాయి. ప్రస్తుతం లాహోర్ జైల్లో ఉన్నాడు. ఐక్యరాజ్యసమితి 2008 డిసెంబర్ 10న హఫీజ్ సయీద్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.