Donald Trump Attacked :అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మట్లాడుతుండగా ఒక్కసారిగా ఆగంతుకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ట్రంప్ కుడిచెవికి బుల్లెట్ తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ట్రంప్‌ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వేదిక పైనుంచి దిగేటప్పుడు ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టుబట్టాయి. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం, ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 గంటలకు జరిగింది. ఈ ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తూ ఉంది. దీంతో కాల్పుల దృశ్యాలు, తర్వాత జరిగిన పరిణామాలన్నీ వీడియోల్లో రికార్డయ్యాయి. బుల్లెట్ ట్రంప్ చెవి పైనుంచి దూసుకెళ్లడం, ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి.
దగ్గర్లో ఉన్న భవనం పైనుంచి!
కాల్పుల శబ్దం విని వెంటనే అప్రమత్తమైన ట్రంప్ పోడియం కింద చేరి తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణగా చేరి బయటకు తీసుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కారులో ఎక్కించుకుని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దుండగుడు దగ్గర్లో ఉన్న భవనం పైనుంచి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు. తుపాకీతో ర్యాలీకి వచ్చిన అతడు భవనంపైకి పాకడం తాము గమనించామని వెల్లడించారు.
'ఏదో జరుగుతోందని అర్థమైంది'
కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ ట్రుత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "కాల్పుల ఘటనపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. చాలా రక్తస్రావం జరిగింది" అని పోస్ట్ చేశారు.
దాడిని తీవ్రంగా ఖండించిన బైడెన్, మోదీ
మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఘటనను భారత ప్రధాని మోదీ సైతం ఖండించారు. రాజకీయాల్లో హింసకు తావులేదని, ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ట్రంప్ కాల్పుల ఘటనకు సంబంధించి US సీక్రెట్ సర్వీస్‌తో కలిసి FBI సంయుక్తంగా దర్యాప్తు చేపడుతోంది.