Government Free Money Distribution :దేశ ప్రజల అకౌంట్లలో ప్రభుత్వం ఫ్రీగా డబ్బులను జమచేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. ఈ స్కీమ్‌ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు ఫ్రీ మనీ అందించేందుకు తాము సిద్ధమని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి స్రెథ్థా థావిసిన్ ప్రకటించారు. అర్హతగల వ్యాపారులు, వ్యక్తులు వచ్చే నెల 1 నుంచి ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. డిజిటల్ వ్యాలెట్(Digital Wallet) పేరుతో ఈ స్కీంను అమలు చేస్తామని తెలిపారు. దీనివల్ల దేశంలో ఆర్థిక పురోగతికి మార్గం సుగమం అవుతుందని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 1.2 శాతం నుంచి 1.6 శాతానికి పెరుగుతుందన్నారు. ఈ మేరకు వివరాలతో ప్రధాని థావిసిన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
అప్లై చేయడానికి అర్హతలివీ
డిజిటల్ వ్యాలెట్ స్కీం ద్వారా దాదాపు 5 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని థాయ్‌లాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ స్కీంకు 16 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరినీ అర్హులుగా పరిగణించాలని తొలుత భావించారు. కానీ ఈ నిబంధనను మార్చేసి, తక్కువ ఆదాయ వర్గాలకు మాత్రమే దరఖాస్తు చేసే అవకాశం ఇచ్చారు. రూ.19 లక్షలలోపు వార్షిక ఆదాయం, రూ.11 లక్షలలోపు పొదుపు మొత్తాలు కలిగిన వారు మాత్రమే అప్లై చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకానికి ఎంపికయ్యే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.23వేలు (10వేల బహ్త్‌లు) చొప్పున డిజిటల్ మనీని జమ చేయనున్నారు. కేవలం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండే ఈ డబ్బును ఏయే అంశాలపై ఖర్చు పెట్టొచ్చు? అనే దానిపై థాయ్‌లాండ్ వాణిజ్య శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనుంది. ఈ డిజిటల్ మనీని కొన్ని వస్తువులు/ సేవల కొనుగోళ్లపై ఖర్చు చేయకుండా పరిమితిని విధించనున్నారు. ఈ విధంగా మినహాయించే విభాగాల్లో చమురు కొనుగోళ్లు, సేవలు, ఆన్లైన్ కొనుగోళ్లు వంటి కేటగిరీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
'పథకం అమలు అంత ఈజీ కాదు'
ఈ స్కీం అమలు అంత ఈజీ కాదని విపక్షాలు, పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న థాయ్‌లాండ్‌ను డిజిటల్ వ్యాలెట్ స్కీం దివాలా తీసే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిజిటల్ వ్యాలెట్ స్కీంకు స్టేట్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ నుంచి నిధులు పొందాలని తొలుత భావించినప్పటికీ, ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంది. 2024-25 దేశ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ స్కీంను భాగం చేయాలని నిర్ణయించింది.