తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజాలో పోలియో కేసుతో WHO అలెర్ట్​- యుద్ధభూమిలో వ్యాక్సినేషన్‌ షురూ - Gaza Polio Vaccine - GAZA POLIO VACCINE

Gaza Polio Vaccination : ఇజ్రాయెల్- హమాస్‌ యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో ఇటీవల పోలియో కేసు వెలుగు చూడటం వల్ల ప్రపంచ ఆరోగ్యం సంస్థ అప్రమత్తమైంది. ఆగస్టు 31 నుంచి చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం ప్రారంభిన్నట్లు గాజా ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

Gaza Polio Vaccine
Gaza Polio Vaccine (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 7:05 AM IST

Gaza Polio Vaccination : ఇజ్రాయెల్- హమాస్‌ యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో ఇటీవల పోలియో కేసు వెలుగుచూడడం కలకలం రేపింది. పాతికేళ్లలో తొలిసారి ఈ కేసు నమోదు కావడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఆదివారం నుంచి చిన్నారులకు టీకాల పంపిణీ చేపడతామని ఇటీవల ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ ఒకరోజు ముందుగానే ప్రారంభమైంది. గాజా ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఖాన్‌ యూనిస్‌లోని ఓ ఆస్పత్రిలో పిల్లలకు వ్యాక్సిన్‌లు ఇచ్చినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.

25 ఏళ్లలో ఇదే తొలిసారి
గత నెల పాలస్తీనాను పోలియో మహమ్మారి ప్రాంతంగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ సైనిక చర్య వల్ల అక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆ పరిస్థితులు కారణంగానే వైరస్‌ పునరుజ్జీవానికి దారితీశాయని ఆరోపించింది. దక్షిణ ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో సేకరించిన మురుగు నీటి నమూనాల్లో వైరస్‌ కనిపించిందని పేర్కొంది. వైరస్‌ ఉనికి గాజా సహా పొరుగు దేశాల్లోని నివాసితులకు ముప్పుగా పరిణమిస్తుందని చెప్పింది. ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమానికి విఘాతం కలిగిస్తుందని తెలిపింది. ఈ క్రమంలోనే గాజాలో 25 ఏళ్లలో తొలిసారి ఓ చిన్నారికి వైరస్ సోకడం వల్ల పక్షవాతానికి గురయ్యిందని ఆగస్టు 23న డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించింది.

దాడులకు విరామం
ఇక ఇప్పటికే గాజాకు 12 లక్షల పోలియో టీకా డోసులను యూనిసెఫ్​ పంపించింది. ఐరాస వాలంటీర్లతో సహా మొత్తం మూడు వేల మంది సిబ్బందితో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ప్రణాళిక రచించింది. గాజాలో దాదాపు 6,50,000 మంది చిన్నారులకు తొలి రౌండ్ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమైంది. పోలియో వ్యాక్సిన్ల పంపిణీ నిమిత్తం దాడులకు విరామం ఇచ్చేందుకు ఇరుపక్షాలు అంగీకరించినట్లు పేర్కొంది. తొలుత సెంట్రల్ గాజా, తర్వాత దక్షిణ, ఉత్తర గాజాలోని చిన్నారులకు టీకాలు వేయనున్నట్లు తెలిపింది. మొదటి రౌండ్ వ్యాక్సిన్‌ వేసిన నాలుగు వారాల అనంతరం రెండో విడత టీకా వేయాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details