France Telecommunication Network Issue :విశ్వ క్రీడలు ఒలింపిక్స్ జరుగుతున్న వేళ ఫ్రాన్స్‌లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. ఫ్రాన్స్‌లోని పలు టెలికమ్యూనికేషన్ లైన్లను ధ్వంసం చేశారు. దీంతో ఫైబర్, మొబైల్ ఫోన్ లైన్లు ప్రభావితం అయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రెంచ్ అధికారులు సోమవారం తెలిపారు.
రాత్రివేళ ధ్వంసం
ఫ్రాన్స్‌లోని టెలి కమ్యూనికేషన్ లైన్లను దుండగులు ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కట్ చేశారని ఆ దేశ డిజిటల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ స్టేట్ సెక్రటరీ మెరీనా ఫెరారీ తెలిపారు. ఈ ప్రభావం టెలికాం ఆపరేటర్లపై పడిందని ఎక్స్ ద్వారా వెల్లడించారు. అయితే ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న పారిస్ నగరం టెలికమ్యూనికేషన్ లైన్ల ధ్వంసంతో ప్రభావితం అయ్యిందా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
సేవల పునరుద్ధరణకు రెడీ
టెలికమ్యూనికేషన్ లైన్ల ధ్వంసంతో ఆరు పరిపాలనా విభాగాలు ప్రభావితమయ్యాయని ఫ్రెంచ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. టెలికాం ఆపరేటర్లు బోయ్గ్స్, ఫ్రీ (Free), ఎస్ఎఫ్ఆర్ తమ సేవలకు అంతరాయం కలిగినట్లు ధ్రువీకరించాయి. త్వరగా సేవలను పునరుద్ధరించడానికి తమ బృందాలను పంపామని టెలికాం ఆపరేటర్ ఫ్రీ మాతృ సంస్థ తెలిపింది.
కాగా, ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు పారిస్ నగరం రైల్ నెట్‌వర్క్‌పై దాడులు జరిగాయి. దీంతో దాదాపు 8 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల పరికరాలకు నిప్పుపెట్టడం, కేబుల్స్ కత్తిరించడం వంటి ఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతడు అతివాద వామపక్ష భావజాలానికి ప్రభావితమైన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతడి వద్ద ఎస్‌ఎన్‌సీఎఫ్ టెక్నికల్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అవసరమైన తాళాలు ఉండటం గమనార్హం.
అయితే రైల్వే పట్టాలకు నిప్పు పెట్టి తప్పించుకుంటుండగా దుండగులను కొందరు స్థానికులు చూశారని ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు. రైల్వే పట్టాల వద్ద నిప్పును రాజేసే పరికరాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించారు. రైల్వే నెట్‌వర్క్ ఈ దాడుల నుంచి ప్రస్తుతం కోలుకుంటోంది.
అనేక మంది అదుపులోకి!
మరోవైపు, ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్‌ను భగ్నం చేయడానికి కుట్రపన్నుతున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకొన్నారు. ఫ్రాన్స్ భద్రతా దళాలు దాదాపు 50 మందిని అరెస్టు చేశాయని భద్రతాధికారి గెర్లాండ్ డార్మనిన్ పేర్కొన్నారు.