తెలంగాణ

telangana

ETV Bharat / international

పెను విషాదం- హెలికాప్టర్​ ఢీకొని ఆ విమానంలోని 64 మంది మృతి! - WASHINGTON DC PLANE CRASH

అమెరికా వాషింగ్టన్‌లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం, సైనిక హెలికాప్టర్‌ ఢీ- విమానంలోని వారంతా మృతి చెందినట్లు భావిస్తున్నామని స్థానిక ఫైర్‌ చీఫ్‌ ప్రకటన

Washington DC Plane Crash
Washington DC Plane Crash (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 6:45 PM IST

Updated : Jan 30, 2025, 7:23 PM IST

Washington DC Plane Crash : అమెరికాలోని వాషింగ్టన్‌ సమీపంలో ప్రయాణికుల ఫ్లైట్, సైనిక హెలికాప్టర్‌ ఢీకొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయారు! ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలను నదిలో నుంచి అధికారులు వెలికితీశారు. గురువారం ఉదయం(స్థానిక కాలమానం ప్రకారం) అగ్నిమాపక శాఖ చీఫ్‌ ఈ విషయం ప్రకటించారు. విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిపారు.

24 ఏళ్లలో ఇదే పెద్ద ప్రమాదం!
ప్రయాణికుల విమానం నుంచి 27 మంది మృతదేహాలు, హెలికాప్టర్​ నుంచి ఒకరి మృతదేహం ఇప్పటి వరకు వెలికి తీసినట్లు ఫైర్ చీఫ్ చెప్పారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదమని అన్నారు.

'తలకిందులుగా కూరుకుపోయిన విమానం'
విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడకు దగ్గర్లోనే హెలికాప్టర్‌ శఖలాలను కూడా గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారి జాన్‌ డొన్నెలీ తెలిపారు. ఆ సైనిక హెలికాప్టర్‌ విమానం దారిలోకి ఎందుకు వచ్చిందో తెలియదని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ వ్యాఖ్యానించారు.

ప్రమాదం జరిగిందిలా! (Associated Press)

అసలేం జరిగిందంటే?
కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరిన పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికుల విమానం వాషింగ్టన్‌ సమీపంలోని రోనాల్డ్‌ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా, రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది.

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానాన్ని స్థానికంగా పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తోంది. ఘటనా సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు మాత్రం ఎవరూ లేరని ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన గగనతలం ప్రపంచంలోనే అత్యంత నియంత్రణతో, నిరంతరం పర్యవేక్షణలో ఉండే ప్రాంతం. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు దక్షిణాన కేవలం మూడు మైళ్ల దూరంలో జరిగిందీ దుర్ఘటన.

Last Updated : Jan 30, 2025, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details