Explosion In Pakistan Airport :పాకిస్థాన్ కరాచీలోని జిన్న అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు సహా ఒక పాకిస్థానీ మృతిచెందారు. మరో 17మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత అక్కడున్న మరికొన్ని వాహనాలకు మంటలు వ్యాపించాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మషేహర్ తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాద హస్తం ఉండే అంశాన్నితోసిపుచ్చలేమని చెప్పారు.
పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీలో పనిచేసే చైనా సిబ్బందిని తీసుకెళ్తున్న కాన్వాయ్‌పై రాత్రి 11 గంటల సమయంలో దాడి జరిగిందని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు మరణించారని, మరొకరు గాయపడ్డారని ఒక పాకిస్థానీ కూడా మరణించినట్లు చెప్పింది. అంతేకాకుండా ఈ ఘటనను ఉగ్రదాడిగా డ్రాగన్ పేర్కొంది. ఈ ఘటన తర్వాతి పరిణామాలపై పాకిస్థాన్‌తో చైనా కలిసి పనిచేస్తోందని తెలిపింది. ఈ పేలుడుపై సమగ్ర విచారణ జరిపించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. పాక్‌లోని చైనా పౌరులు, కంపెనీలు, ప్రాజెక్టుల భద్రతపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.