Hindu Leader Arrest In Bangladesh : బంగ్లాదేశ్‌లోని హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పించాలని అధికారులను కోరింది. చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న మైనార్టీలపై దాడులు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది.
'తీవ్ర ఆందోళనలో ఉన్నాం'
"బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగ్రన్ జోటే ప్రతినిధి, హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్నాం. బంగ్లాదేశ్‌లో మైనార్టీల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. అలాగే చోరీలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం జరిగాయి. వాటికి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. అలాంటి సంఘటనలకు పాల్పడినవారు పరారీలో ఉన్నారు. శాంతియుతంగా న్యాయబద్ధమైన డిమాండ్లను కోరే హిందూ నాయకుడిపై ఆరోపణలు చేయడం దురదృష్టకరం" అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఖండించిన జగ్గీ వాసుదేవ్
బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడంపై ఇశా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ స్పందించారు. "ప్రజాస్వామ్యయుత దేశం మతతత్వ, నిరంకుశ దేశంగా మారడం వల్ల ఎలా విచ్ఛిన్నమవుతుందో చూస్తున్నాం. ప్రజాస్వామ్యం విలువలను అర్థం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. మతం, జనాభా ఆధారంగా హింసించడం ప్రజాస్వామ్య దేశాల మార్గం కాదు. దురదృష్టవశాత్తు మన పొరుగు దేశం ప్రజాస్వామ్య సూత్రాలను వదిలేసింది. పౌరులందరికీ వారి అవసరాలు, నమ్మకాల ప్రకారం జీవించే హక్కు ఉంది. అలాంటి ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి నిర్మించడం బంగ్లాదేశ్‌లోని ప్రతి పౌరుడి బాధ్యత" అని జగ్గీ వాసుదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢాకాలో ఎయిర్ పోర్టులో అరెస్టు
హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ అక్టోబరు 30న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరచారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో సోమవారం అరెస్టు చేశారు. దాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ ప్రతినిధి రెజాల్ కరీం తెలిపారు. ఛటోగ్రామ్ పోలీస్ స్టేషన్‌కు చిన్మయ్ కృష్ణదాస్‌ను అప్పగించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును పలు హిందూ సంఘాలు ఖండించాయి. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.