తెలంగాణ

telangana

ETV Bharat / international

'యుద్ధంలో వెనక్కి తగ్గితే పుతిన్​ను చంపేస్తారు'- రష్యాకు మద్దతుగా మస్క్ వ్యాఖ్యలు

Elon Musk Putin : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఇంకా రష్యాపై ఉక్రెయిన్‌ గెలుస్తుందని అనుకోవడం ఆ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. యుద్దం విషయంలో వెనక్కి తగ్గితే పుతిన్​ను హతమార్చే అవకాశం ఉందన్నారు.

Elon Musk Putin
Elon Musk Putin

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 7:02 AM IST

Elon Musk Putin :ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకని ఈ పోరాటాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉంటారన్నారు. ఆ మేరకు ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. 'ఎక్స్‌' స్పేసెస్‌ వేదికపై రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

మస్క్​ ఆవేదన
రష్యా విషయంలో చేసిన వ్యాఖ్యలపై తనను చాలా మంది విమర్శిస్తున్నారని మస్క్​ అన్నారు. అయితే వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని సూచించారు. కాగా, ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోయే అవకాశాలే లేవన్నారు. ఇంకా రష్యాపై ఉక్రెయిన్‌ గెలుస్తుందని అనుకోవడం ఆ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగించడం వారికే నష్టమని అన్నారు. మరోవైపు, అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఉక్రెయిన్​కు ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు.

నా లక్ష్యం అదే : మస్క్
తనపై వస్తున్న విమర్శల గురించి మస్క్​ స్పందించారు. 'రష్యాకు వ్యతిరేకంగా మా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మా 'స్టార్‌లింక్‌' సేవలు అందుతున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా కీవ్‌ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రష్యా అంతరిక్ష వ్యాపారాల నుంచి స్పేస్‌ఎక్స్‌ తప్పుకుంది. రెండువైపులా ప్రాణనష్టాన్ని అడ్డుకోవడమే నా లక్ష్యం' అని మస్క్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు రష్యాలో పుతిన్‌ను గద్దె దించాలనుకునేవారు ఆయన స్థానంలో ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. రాబోయేవారు శాంతికాముకులు అయ్యుంటారని ఎలా ఆశిస్తారన్నారు. వారు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదన్నారు.

నెగ్గిన బిల్లు
ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌లకు 9,530 కోట్ల డాలర్ల సహాయం అందించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనెట్‌ మంగళవారం ఆమోదించింది. ఇందులో 6,000 కోట్ల డాలర్లను ఒక్క ఉక్రెయిన్‌కే ఇవ్వనున్నారు. ఈ ఆర్థిక సహాయాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నందున బిల్లు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉంది. చివరకు 22 మంది రిపబ్లికన్లు పాలక డెమోక్రాట్లతో చేతులు కలపడం వల్ల సెనెట్‌లో బిల్లు 70-29 ఓట్లతో నెగ్గింది.

UAEలో అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

'అప్పుడు అయోధ్య, ఇప్పుడు అబుదాబి- రెండింటికీ ప్రత్యక్ష సాక్షిని కావడం అదృష్టం'

ABOUT THE AUTHOR

...view details