Tulsi Gabbard US Politics :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రయత్నించిన వారికి డొనాల్డ్ ట్రంప్ కీలక పోస్టులు కేటాయిస్తున్నారు. తాజాగా తన నూతన పాలనా యంత్రాంగంలో భారతీయ అమెరికన్ తులసీ గబ్బార్డ్‌కు చోటు కల్పించారు. ఒకప్పటి డెమొక్రాట్, యూఎస్ కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందువు అయిన తులసీ గబ్బార్డ్‌ను నేషనల్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. విదేశాంగ మంత్రిగా సనేటర్ మార్కో రుబియోను, అటార్నీ జనరల్‌గా ఫ్లోరిడాకు చెందిన మేట్ గేట్జ్‌ను ఎంచుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ 2.Oలో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి - నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్ నియామకం
ట్రంప్ కార్యవర్గంలో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు - నేషనల్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్ - అటార్నీ జనరల్‌గా మేట్ గేట్జ్
Published : Nov 14, 2024, 6:51 AM IST
నాలుగుసార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన తులసి, 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొకట్రిక్ అభ్యర్థిగా పోటీకి యత్నించారు. పశ్చిమాసియా, ఆఫ్రికాల్లోని యుద్ధక్షేత్రాల్లో మూడుసార్లు అమెరికా సైన్యం తరపున ఆమె పనిచేశారు. ఇక అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు పలికారు. కాంగ్రెస్ ఉమెన్, లెఫ్టినెంట్ కర్నల్ తులసీ గబ్బార్డ్‌ను నేషనల్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్‌గా ఎన్నుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా దేశం కోసం, అమెరికన్ల స్వాతంత్య్రం కోసం తులసి పనిచేసినట్లు ట్రంప్ తెలిపారు. నిఘా యంత్రంగాన్ని నిర్భయంగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ తన బలమైన వ్యక్తిత్వంతో ఆమె శాంతిని తీసుకొస్తారని ట్రంప్ ఆకాంక్షించారు. తులసి మనందరినీ గర్వపడేలా చేస్తుందని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిగా సెనేటర్ మార్కో రుబియోను కూడా అమెరికా కోసం బలంగా నిలబడతారని ట్రంప్ చెప్పారు.
ప్రభుత్వ సన్నాహాల్లో భాగంగా ట్రంప్ పలు పోస్టులకు నేతలను ఎంపిక చేస్తూ వస్తున్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామిను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించారు. ఫాక్స్ న్యూస్ ప్రయోక్త పీట్ హేగ్‌సేత్‌ను అమెరికా రక్షణమంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్‌ను, నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా ట్రంప్ నియమించారు. ఇక అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు.