Interesting Facts About Brain:సాధారణంగా మానవ మెదడులో ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు సృష్టించగల శక్తి, సామర్ధ్యం ఉన్నాయన్న విషయం మనకి తెలుసు. ఇది శరీరంలో సున్నితమైన అవయవం అయినప్పటికీ , శరీరంలో అనేక విధులను బాధ్యతగా చేస్తుంది. అయితే ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా మెదడుకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇంక రహస్యంగానే మిగిలిపోయాయి.
ప్రపంచంలో ప్రకృతిని అంతో ఇంతో జయించగలిగింది మానవుడే. ఇతర జీవులను తన చెప్పుచేతులతో నియంత్రించగలిగింది మానవుడే. తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతినాశనం చేసేది కూడా మనిషే. వీటన్నింటికీ ప్రధాన కారణం ఆలోచనా కేంద్రంగా ఎదిగిన మెదడే. అయితే ఆ మెదడు తనను తానే తింటుందని మీకు తెలుసా. అంటే మెదడులో ఫాగోసైటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. మెదడులో ఉండే కణజాలం తనను తాను సరిగ్గా నిర్వహించుకోవటానికి భక్షక కణజాలంగా మారుతుందన్నమాట.
నిజానికి మన శరీరంలో సూక్ష్మ జీవులు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి. వీటి నుంచి మనల్ని కాపాడటానికి రోగ నిరోధక వ్యవస్థ సహాయపడుతుంది. ఇక మెదడు విషయానికి వస్తే ఏ సమయంలోనైనా మెదడులో చాలా ఫాగోసైటోసిస్ జరుగుతూనే ఉంటుంది. వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందటానికి ఈ ప్రక్రియ ఎంతో అవసరం. మెదడు అనేక కోట్ల నాడీ కణాలతోనూ, సహాయక కణాలతోనూ నిర్మింపబడింది. ఇందులో సహాయ కణాలు నాడి కణాలకు ఆహారం, ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలను, కార్బన్ డై ఆక్సైడ్ ను విసర్జించడానికి ఉపయోగపడుతాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియలో పనికిరాని కణాలు, మరణించిన కణాలను తొలగించడం కూడా సహజ సిద్ధంగానే జరుగుతుంది. ఈ డెట్రిటస్ అనేది తొలగించడం చాలా వరకు మనం నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది.