Israel Hezbollah Ceasefire : పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా రగులుతున్న నిపుకణికలు కాస్త చల్లారాయి. ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, ఎట్టకేలకు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిలిచిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య 14 నెలల క్రితం మొదలైన యుద్ధం ముగియడానికి ఈ ఒప్పందం కీలక ముందడుగుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు.
రోడ్లుపైకి వచ్చి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు (Associated Press) 'విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలి'
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విమరణకు అంగీకరించగా ఎట్టకేలకు కాల్పులు, బాంబు దాడుల మోత ఆగింది. ఈ ఉదయం ఏడున్నర గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని, ఇది ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని బైడెన్ ఆకాంక్షించారు.
ఒప్పందం ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా, లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందని జో బైడెన్ అన్నారు. దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దళాలతో పాటు ఐరాస శాంతి బృందాలను మోహరించనుండగా అక్కడి పరిస్థితులను అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షిస్తుందని బైడెన్ తెలిపారు. రానున్న రోజుల్లో గాజాలోనూ కాల్పుల విరమణ, బందీల విడుదలకు టర్కీ, ఈజిప్టు, ఖతార్ నాయకులతో చర్చలు జరుపుతామని వివరించారు. ఇజ్రాయెల్ -హెజ్‌బొల్లా మధ్య కుదిరిన ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కూడా తాజా పరిణామాన్ని స్వాగతించారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ గౌరవించాలని కోరారు.
మరోవైపు ఈ కాల్పుల ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. తాజా పరిణామాలు శాంతి, స్థిరత్వానికి దారితీస్తాయని ఆశిస్తున్నట్లుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ మేరకు ఓ ప్రకటను విడుదల చేసింది. దౌత్యం, చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ ముందు నుంచే చెబుతుందని తెలిపింది.
'ఉల్లంఘిస్తే బలంగా ప్రతిస్పందిస్తాం'
తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ వైఖరిపైనే ఆధారపడి ఉందన్న ఆయన, తాము ఒప్పందాన్ని అమలు చేస్తున్నామని, ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణకు మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు. తమ సైనికుల క్షేమం సహా హమాస్‌ను ఒంటరిని చేయాలనేది తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యానికి ఆయుధాల పంపిణీలో జాప్యం జరిగినట్లు అంగీకరించిన నెతన్యాహూ త్వరలోనే అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పారు. హమాస్‌ను అంతమొందించాలనే తమ లక్ష్యాన్ని పూర్తి చేసి తీరుతామని తేల్చిచెప్పారు. బందీలుగా ఉన్న వారందరినీ వెనక్కు తీసుకొస్తామని స్పష్టం చేశారు.
ఇరాన్‌పై ఫోకస్ చేసేందుకే!
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించడానికి మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనేది ఇజ్రాయెల్ వ్యూహం అనే వాదన వినిపిస్తోంది. నెతన్యాహు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అటు లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు. విరమణ ఒప్పంద ప్రకటన అనంతరం ఆయన బైడెన్‌తో మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు. ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఇరు దేశాలు అమలు చేయాలని కోరారు. యుద్ధం కారణంగా వలస వెళ్లిన ప్రజలు తిరిగి లెబనాన్ చేరుకుంటున్నారు. చాలా కాలం తర్వాత లెబనాన్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే వలస వెళ్లిన ప్రజలు చాలాచోట్ల సంబరాలు చేసుకున్నారు.
సంబరాలు చేసుకుంటున్న ప్రజలు (Associated Press) సంబరాలు చేసుకుంటున్న ప్రజలు (Associated Press) కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే గంట ముందు వరకు ఇజ్రాయెల్ లెబనాన్‌లోని బీరుట్‌పై భీకర దాడులు చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 42మంది చనిపోయారు.