తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ పేలోడ్​తో చంద్రుడి ఆవలివైపు నమూనాల కోసం చైనా ప్రయోగం- తొలి దేశంగా ఘనత! - China Change 6 Lunar Mission - CHINA CHANGE 6 LUNAR MISSION

China Change 6 Lunar Mission : కీలక అంతరిక్ష పరిశోధన మిషన్​ చేపట్టింది చైనా. చంద్రుడి అవతలి భాగంలోని నమూనాలను సేకరించేందుకు చాంగే-6 అనే వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించింది. చంద్రుడిపై 2 మీటర్ల లోతునున్న 2 కేజీల మెటీరియల్‌ను సేకరించి చాంగే-6 భూమికి తీసుకురానున్నట్లు చైనా వెల్లడించింది.

China Chang'e 6 Lunar Mission
China Chang'e 6 Lunar Mission (Asssociated Press)

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 8:00 AM IST

China Change 6 Lunar Mission :చంద్రుడి అవతలి భాగంలోని నమూనాలను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న చైనా లునార్ ప్రోబ్‌ చాంగే-6ను ప్రయోగించింది. డ్రాగన్‌ చేపట్టిన లూనార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్యక్రమంలో భాగంగా వెన్‌ఛెంగ్‌ శాటిలైట్‌ లాంఛింగ్ సెంటర్‌ నుంచి లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా చాంగే-6ను శుక్రవారం ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో చాంగే-6 దిగనుందని చైనా వెల్లడించింది. చంద్రుడిపై 2 మీటర్ల లోతునున్న 2 కిలోల సామగ్రిని సేకరించి చాంగే-6 భూమికి తీసుకురానున్నట్లు తెలిపింది.

అనంతరం వీటిని తమ శాస్త్రవేత్తలు విశ్లేషించనున్నారని చెప్పింది. ఇక్కడ చాలాకాలంగా సూర్యకాంతి లేకపోవడం వల్ల చంద్రుడిపై పరిస్థితులను తెలిపే చాలా ఆధారాలు లభించవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రయోగంలో ఫ్రాన్స్‌, ఇటలీ, స్వీడన్‌, పాకిస్థాన్‌కు చెందిన శాస్త్రీయ పరికారాలు ఉపయోగించామన్నారు. 2019లో విజయం సాధించిన చాంగే-4 మిషన్‌ ఆధారంగా దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే జాబిల్లి ఆవలి భాగంలో శిలలు, మట్టిని సేకరించిన తొలి దేశంగా చైనా నిలవనుంది.

చైనా రెక్కలతో ఎగిరిన పాకిస్థాన్!
చైనా పంపిన ఆర్బిటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఐక్యూబ్‌-క్యూ అనే పేలోడ్‌ కూడా ఉంది. చందమామ వద్దకు ప్రయోగించిన వ్యోమనౌకల్లో పాకిస్థాన్‌ పరికరాన్ని చైనా ఉంచడం ఇదే మొదటిసారి. ఐక్యూబ్‌-క్యూను పాక్‌, చైనా అంతరిక్ష సంస్థలు రూపొందించాయి. ఇందులో రెండు ఆప్టికల్‌ కెమెరాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని ఇవి చిత్రీకరిస్తాయి.

చాంగే-6 ప్రయాణం ఇలా
అసెండర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌, చంద్రుడి దక్షిణ ధ్రువంలోని అయిట్కెన్‌ బేసిన్‌లో ఉన్న అపోలో క్రేటర్‌లో దిగుతుంది. ఇది సౌర కుటుంబంలోనే అత్యంత భారీ బిలాల్లో ఒకటి. ఈ బిలం 2,500 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. ఇది చాలా పురాతనమైనది. శాశ్వతంగా చీకట్లో ఉండే ఆ ప్రాంతంలోని శిలల్లో చందమామ తొలినాటి చరిత్ర, పరిణామక్రమానికి సంబంధించిన ఆనవాళ్లు నిక్షిప్తమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

  • చందమామపై దిగిన 48 గంటల్లోగా అసెండర్‌లోని రోబోటిక్‌ చేయి దాదాపు 2 కిలోల నమూనాలను సేకరిస్తుంది. ఇందులో కొంత ఉపరితలం నుంచే సేకరిస్తుంది. నేలను 2 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేసి అక్కడి నుంచి మరికొన్ని నమూనాలనూ తీసుకుంటుంది.
  • రోబోటిక్ హ్యాండ్​ సేకరించిన నమూనాలు ఒక కంటెయినర్‌లోకి చేరుతాయి. ఆ తర్వాత అసెండర్‌ మాడ్యూల్‌, చంద్రుడి ఉపరితలం నుంచి పైకి దూసుకెళుతుంది. చంద్రుడి కక్ష్యలోని ఆర్బిటర్‌తో అనుసంధానమవుతుంది.
  • అనంతరం ఈ శాంపిళ్లు ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్‌లోకి చేరుతాయి.
  • ఆ ఆర్బిటర్‌ భూమి దిశగా పయనాన్ని ఆరంభిస్తుంది. పుడమికి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్‌, ఆర్బిటర్‌ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.
  • చైనాలోని ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ ప్రాంతంలో రీఎంట్రీ మాడ్యూల్‌ దిగుతుంది. మొత్తంమీద ఈ యాత్ర 53 రోజుల పాటు సాగుతుంది.
  • చాంగే-6తో కమ్యూనికేషన్లు సాగించడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి చైనా ఇప్పటికే పంపింది.

ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ!
చందమామకు సంబంధించి మనకు ఎప్పుడూ కనిపించే ఇవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి, భూమికి తీసుకొచ్చింది. కానీ అవతలి భాగం నుంచి ఈ నమూనాలను తీసుకురావడం చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఆ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు పెద్దగా అవగాహన లేదు. ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. తాజా యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతోపాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని రిమోట్‌ సెన్సింగ్‌ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. కానీ అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది. అవతలి భాగం పైపొర ఒకింత మందంగా ఉందని పరిశీలనల్లో తేలింది. దీనికి కారణాలు అంతుచిక్కకుండా ఉన్నాయి.

ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు- భారత సంతతికి చెందిన వారే! - Nijjar Death Case

ఎన్నికల ముందు రిషి సునాక్‌కు షాక్- ప్రధాని పీఠంపైనా ప్రభావం! - uk election 2024

ABOUT THE AUTHOR

...view details