చంద్రుడిపై నీటి ఆనవాళ్లు- నాలుగేళ్లకు గుర్తించిన చైనా పరిశోధకులు - Change 5 Mission - CHANGE 5 MISSION
Change 5 Mission: చాంగే-5 సాయంతో జాబిల్లి నుంచి భూమికి మట్టిని తీసుకువచ్చిన చైనా నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనల్లో చైనా అందులో నీటి జాడను గుర్తించింది.

Published : Jul 24, 2024, 9:06 PM IST
Change 5 Mission :చంద్రుడి అన్వేషణలో భాగంగా చాంగే-5 అంతరిక్షనౌకతో తీసుకొచ్చిన జాబిల్లి మట్టిపై నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్న చైనా, అందులో నీటి జాడలను గుర్తించింది. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. చంద్రుడిపై మట్టి నమూనాల సేకరణ లక్ష్యంగా 2020లో చైనా చాంగే-5 ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రుడి నుంచి 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. వాటిపై బీజింగ్ నేషనల్ లేబొరేటరీ ఫర్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో నమూనాల్లో విస్తృత స్థాయిలో నీటి అణువులు గుర్తించారు. జాబిల్లిపై పరిశోధనలో భాగంగా ఇద్దరు అమెరికా వ్యోమగాములు 40ఏళ్ల క్రితమే చంద్రునిపైకి వెళ్లి నమూనాలను సేకరించారు. సోవియట్ యూనియన్ కూడా 1976లో చంద్రుడి మట్టి నమూనాలను తీసుకురాగలిగింది. జాబిల్లి నుంచి మట్టిని సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది. 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక కూడా చంద్రుడిపై నీటి జాడను గుర్తించింది.