Donald Trump Elon Musk :అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. తాను తీసుకునే నిర్ణయాల్లో కూడా మస్క్ అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో అమెరికా తదుపరి అధ్యక్షుడు మస్క్ అవుతారా అని ప్రశ్నలు వెల్లువెత్తుతుండగా, ట్రంప్ తాజాగా స్పందించారు.
మస్క్ ప్రెసిడెంట్ కాలేరని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ఆరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ప్రెసిడెంట్ మస్క్' అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. "ఆయన (మస్క్) అధ్యక్షుడు కాలేరని నేను చెప్పగలను. ఎందుకో తెలుసా? ఆయన ఈ దేశంలో జన్మించలేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత అయిన మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, అధ్యక్ష పదవి చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలి.
మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన కార్యవర్గంలో భారత అమెరికన్లకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్, తాజాగా తన పాలకవర్గంలో మరో భారత అమెరికన్ వ్యాపారవేత్తకు చోటు కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
"వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్ పనిచేయనున్నారు. వైట్‌హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఒ శాక్స్‌తో కలిసి ఆయన పని చేస్తారు. కృత్రిమ మేధతో అమెరికన్ నాయకత్వాన్ని మరింత ముందుకుతీసుకెళ్తారు" అని ట్రంప్ వెల్లడించారు. దీనికి శ్రీరామ్ కృష్ణన్ స్పందిస్తూ కాబోయే అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2007లో మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరీర్‌ను ఆరంభించారు. ఆ తర్వాత ఫేస్‌బుక్, యాహూ, ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్), స్నాప్ వంటి సంస్థలో పనిచేశారు. 2022లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో కృష్ణన్ అక్కడే పనిచేశారు. ఆ సమయంలో సంస్థ తదుపరి సీఈఓగా కృష్ణన్‌ను నియమిస్తారనే ప్రచారం జరిగింది.