British King Charles 3 Cancer :బ్రిటన్ రాజు ఛార్లెస్-3 ఓ రకమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం ప్రకటించింది. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల విస్తరించిన ప్రోస్టేట్ కోసం చికిత్స తీసుకుంటున్న క్రమంలో క్యాన్సర్ విషయం బయటపడిందని పేర్కొంది. క్యాన్సర్ రకం గురించి అధికారికంగా చెప్పనప్పటికీ 75 ఏళ్ల రాజు ఛార్లెస్-3 సోమవారం నుంచి సాధారణ చికిత్స తీసుకుంటున్నట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పింది.
అధికారిక పనులకు దూరం!
వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారనీ చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022 సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు.
జనవరి 29న లండన్ క్లినిక్ నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాత ఆదివారం నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్‌లో ఉన్న చర్చిలో కనిపించారు రాజు ఛార్లెస్-3. అక్కడ భార్య రాణి కెమిల్లాతో కలిసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయనకు క్యాన్సర్ సోకిందని నిర్ధరణ కావడం వల్ల సాండ్రింగ్‌హామ్ నుంచి లండన్‌కు బయలుదేరారు. ప్రస్తుతం లండన్‌లోని తన ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు.
ఛార్లెస్-3 దంపతులకు ఇద్దరు కుమారులు(విలియం, హ్యారీ), ఒక కుమార్తె(ప్రిన్స్ విలియం) ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ తన తండ్రిని పరామర్శించేందుకు త్వరలోనే యూకేకు చేరుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఛార్లెస్-3 కోడలు, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ ఉదర సంబంధిత వ్యాధి నుంచి కోలుకున్నారు.