US Elections Biden Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తర్వాత కమలా హారిస్‌పై మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జమాల్ సిమన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి జో బైడెన్ రాజీనామా చేసి, కమలా హారిస్‌ను యూఎస్ మొదటి మహిళా అధ్యక్షురాలిని చేయాలని సూచించారు. జో బైడెన్ అద్భుతంగా పరిపాలించారని, కానీ తన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఓ టాక్ షోలో వ్యాఖ్యానించారు.
రాబోయే 30 రోజుల్లో అధ్యక్ష పదవికి బైడెన్ రాజీనామా చేయొచ్చని జమాల్ సిమన్స్ అభిప్రాయపడ్డారు. అందుకే కమలా హారిస్‌ను అమెరికా అధ్యక్షురాలిగా చేయాలని కోరారు. "జో బైడెన్ రాజీనామా చేసి కమలను అమెరికాకు మొదటి మహిళ అధ్యక్షురాలిని చేయాలి. అప్పుడు రాబోయే కాలంలో మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇది జో బిడెన్ నియంత్రణలో ఉన్న విషయం. ఆయన కమలకు పగ్గాలు అప్పగిస్తే తన చివరి వాగ్దానం నెరవేరుతుంది. అలాగే అమెరికాకు కమలా హారిస్ 47వ అధ్యక్షురాలిగా ఎన్నికవుతారు" అని జమాల్ సిమన్స్ వ్యాఖ్యానించారు.
సెనెట్‌పై పట్టు సాధించేందుకు ట్రంప్ ప్లాన్!
మరోవైపు, అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న వేళ రిపబ్లికన్ నేత డొనాల్ట్ ట్రంప్ తన పాలకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగానే కేబినెట్ నియామకాలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెనెట్ సమ్మతి లేకుండానే తనకు ఇష్టమొచ్చిన అధికారులను నియమించుకునే హక్కు ఇవ్వాలని రిపబ్లికన్ చట్టసభ్యులను డిమాండ్ చేశారు. ఇందుకోసం నిబంధనలు మార్చాలని ట్రంప్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కాగా, దక్షిణ డకోటాకు చెందిన రిపబ్లికన్ జాన్ థూన్, టెక్సాస్‌కు చెందిన జాన్ కార్నిన్, ఫ్లోరిడా వాసి రిక్ స్కాట్ రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేట్‌కు నాయకత్వం వహించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురూ ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేబినెట్, జ్యుడీషియల్ పోస్టులకు ఎవరినైనా అధ్యక్షుడు నామినేట్ చేస్తే దానికి సెనెట్ అనుమతి పొందడం తప్పనిసరి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్షుడు ఈ సెనెట్ ఓటింగ్‌కు బైపాస్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. తాజాగా ట్రంప్ దాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అక్రమ వలసలపై వివేక్ కీలక వ్యాఖ్యలు
అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలనే ట్రంప్ ప్లాన్‌కు భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి మద్దతు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి అమెరికా గడ్డపై ప్రవేశించినవారు ఇక్కడ ఉండడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. వారు అమెరికాను వీడాలని కోరారు. అమెరికాలో గత కొన్నేళ్లలో నాశనమైన ఇమిగ్రేషన్ వ్యవస్థను ఆచరణాత్మకంగా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
'వాటిపైనే డెమొక్రట్లు దృష్టి సారించాలి'
అమెరికన్ల ఆర్థిక కష్టాలపై మాత్రమే డెమొక్రట్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ నేత రో ఖన్నా తెలిపారు. కొత్త ఫ్యాక్టరీలను నిర్మించడం, కనీస వేతనాలు పెంచడంలో సహాయం చేయడం వంటి మెరుగైన ఆర్థిక విధానాలపై డెమొక్రటిక్ పార్టీ దృష్టి ఉందని పేర్కొన్నారు. యూఎస్ ప్రతినిధుల సభలో సిలికాన్ వ్యాలీకి డెమొక్రట్ పార్టీ తరఫున రో ఖన్నా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.