Biden Pardons :సోమవారం అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. జో బైడెన్‌కు అధ్యక్షుడిగా ఇదే చివరి రోజు. అధ్యక్షుడిగా కొన్ని గంటలే మిగులున్నాయి. ఈ సమయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం నుంచి కొందరు కీలక వ్యక్తులను రక్షించడానికి జో బైడెన్ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ, 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై దాడిని దర్యాప్తు చేసిన హౌస్ కమిటీ సభ్యులకు బైడెన్ క్షమాభిక్ష మంజూరు చేశారు. అంటే దీనర్థం సంబంధిత కేసుల్లో నేరానికి పాల్పడినట్లు తేలినా, ఎలాంటి చర్యలు తీసుకోరు, శిక్ష లేదా జరిమానా ఉండదు.
బైడెన్ ఎందుకు ఇలా చేశారు?
ఇటీవల ట్రంప్ చేసిన కొన్ని హెచ్చరికల నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత తనను వ్యతిరేకించిన లేదా తన చర్యలపై దర్యాప్తు జరిపిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడంపై హెచ్చరికలు చేశారు. ట్రంప్ 'ఎనిమీస్ లిస్ట్' రూపొందించడం గురించి పదేపదే ప్రస్తావించారు. 2020 ఎన్నికల అవకతవకలను ప్రశ్నించినప్పుడు తనకు అండగా నిలిచిన వారినే సలహాదారులగా నియమించుకున్నారు. తనను సవాలు చేసిన వారిని శిక్షించడానికి ట్రంప్ వెనకాడడని చాలా మంది భయపడుతున్నారు.
క్షమాభిక్ష పొందిన వ్యక్తులు ఎవరు?
డాక్టర్ ఆంటోనీ ఫౌచీ : ఫౌచీ దాదాపు 40 ఏళ్లపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌కు అధిపతిగా పనిచేశారు. ఈయన 2022లో పదవీ విరమణ చేసే ముందు వరకు COVID-19 మహమ్మారి సమయంలో బైడెన్‌కు సలహాదారుడిగా వ్యవహరించారు. మహమ్మారి సమయంలో దేశానికి నాయకత్వం వహించిన ఫౌచీ అందరి దృష్టిని ఆకర్షించారు. అయినప్పటికీ మాస్క్ ఆదేశాలు, టీకాలు వేయడం వంటి చర్యలకు మద్దతు ఇచ్చినందుకు కన్జర్వేటివ్‌ల ఆగ్రహానికి గురయ్యారు. మహమ్మారిపై తాను చేసిన వాదనకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఫౌచీని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.