Biden On President Race Drop Out : డెమొక్రటిక్ పార్టీతో పాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను ఎన్నికల రేసు నుంచి వైదొలిగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే ఉత్తమైన మార్గమని భావించినట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు ప్రకటించిన తర్వాత మొదటిగా ఓవల్ ఆఫీసు నుంచి మాట్లాడిన జో బైడెన్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడమే ముఖ్యం
పదవుల కంటే ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యమంటూ తాను తీసుకున్న నిర్ణయాన్ని జో బైడెన్ సమర్థించుకున్నారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని అన్నారు. దానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని నొక్కి చెప్పారు. పరోక్షంగా అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ఆయన విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థురాలని బైడెన్ ప్రశంసించారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా హారిస్ తగిన వ్యక్తి అని అన్నారు.
'సమర్థంగా పని చేస్తా'
మిగిలిన ఆరు నెలల పదవీకాలంలో తాను క్రియాశీలకంగా ఉండరంటూ వస్తున్న వార్తలను జో బైడెన్ ఖండించారు. అధ్యక్షుడిగా పదవీలో ఉన్నంతకాలం తన విధిని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని హామి ఇచ్చారు. సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడం, గర్భవిచ్ఛిత్తి హక్కు సహా ప్రజల స్వేచ్ఛను కాపాడతానని చెప్పారు. మరోవైపు జో బైడెన్ ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ వస్తున్న వార్తలను వైట్‌హౌస్ కొట్టిపారేసింది. కావాలనే ఇలాంటి వదంతులను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగలేదని స్పష్టం చేసింది.