PM Modi G20 Summit : బ్రెజిల్‌లోని రియో డి జనిరో వేదికగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో బ్రిటన్, ఇటలీ, ఇండోనేసియా, నార్వే, పోర్చుగల్ సహా పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. భారత్‌తో సంబంధాలపై వారితో చర్చించారు.
'బ్రిటన్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం'
"రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలనుకుంటున్నాం" అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో చర్చలు అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. మరోవైపు, భారత్, యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరుదేశాల పరస్పర సహకారంపై ప్రధాని మోదీ, కీర్ స్టార్మర్ చర్చించుకున్నారని ఎక్స్ పోస్టులో తెలిపింది.
'భారత్ తో వాణిజ్య చర్చలకు యూకే రెడీ'
భారత్‌తో యూకే ఒక కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని 10 డౌన్ స్ట్రీట్ ఓ ప్రకటన విడుదల చేసింది. భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పు వంటి రంగాల్లో భారత్ సాయాన్ని కోరుకుంటున్నామని తెలిపింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలకు యూకే కట్టుబడి ఉందని ప్రకటనలో పేర్కొంది.
మరోసారి 'మెలోడీ' మూమెంట్
అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. "రియో డీ జెనీరోలో జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరు దేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీంతో పాటు భారత్, ఇటలీ మధ్య స్నేహం గురించి కూడా చర్చించాం" అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇక మోదీ, జార్జియా మెలోనీ కలిసి దిగే ఫొటోలు మెలోడీ (మెలోనీ+మోదీ) పేరిట పలుమార్లు ట్రెండ్ అయ్యాయి. తాజాగా జీ20 వేదికగా ఈ 'మెలోడీ' మూమెంట్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది.