Sheikh Hasina Charge Against America: బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన హసీనా, ఇటీవల జరిగిన పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు. బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు. తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె, వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకొన్నారని విమర్శించారు. అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు.
ఒక వేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేదికాదని పేర్కొన్నారు. దయ చేసి అతివాదుల మాయలోపడొద్దని బంగ్లాదేశ్ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె భగవంతుని దయవల్ల త్వరలోనే తిరిగి వెళతానని, అవామీ లీగ్ మరోసారి నిలబడుతుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది మే నెలలో హసీనా కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయిఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక దేశానికి బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్యా ఉండేది కాదన్న హసీనా, ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తుందని తెలిపారు. కానీ వారి లక్ష్యం ఎంతదూరం వెళుతుందో తనకు తెలుసునని ఆ ప్రకటనలో హసీనా వివరించారు.