Ashwin Ramaswami Indo American :అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జెన్ Z (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) ఇండో అమెరికన్‌గా అశ్విన్ రామస్వామి(24) నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన ఆయన జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తన రాష్ట్రానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో సెనేట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలాగే ఎదుగుతున్న ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని అన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఎన్నికల భద్రత, టెక్నాలజీ తదితర రంగాల్లో పనిచేశారు అశ్విన్. ఒకవేళ అశ్విన్ రామస్వామి ఎన్నికైతే, కంప్యూటర్ సైన్స్‌తోపాటు లా డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించన్నారు.
తొలి ఇండో అమెరికన్ మెంబర్‌గా!
జార్జియా స్టేట్ లెజిస్లేచర్‌లో మొదటి భారతీయ అమెరికన్ చట్టసభ్యుడిగా కూడా ఘనత సాధించనున్నారు అశ్విన్ రామస్వామి. "ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రజలకు ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ అలా చాలా సమస్యలు ఉన్నాయని గుర్తించాను. అందుకే ఎన్నికల బరిలో దిగాను" అని అశ్విన్ తెలిపారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ ఐటీ రంగానికి చెందినవారేనని చెప్పారు.
భారతీయ సంస్కృతిపై ఆసక్తి
"నా తల్లిదండ్రులిద్దరూ 1990లో తమిళనాడు నుంచి యూఎస్ వచ్చారు. మా అమ్మది చెన్నై, నాన్నది కోయంబత్తూరు. నేను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగాను. నేను హిందువును. నాకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉంది. చిన్మయ మిషన్ బాలవిహార్‌కు వెళ్లి రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇతిహాసాల గురించి తెలుసున్నాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను. అనేక పురాతన గ్రంథాలను చదివాను. ఉపనిషత్తులు చదివాలనే ఆసక్తి ఉంది. రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటాను" అని తెలిపారు.
అనేక రంగాల్లో విధులు!
ప్రముఖస్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో అండర్ గ్రుడ్యుయేషన్ పూర్తి చేశారు అశ్విన్ రామస్వామి. ప్రభుత్వ సంస్థ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(CISA)లో సివిల్ సర్వెంట్‌గా పనిచేశారు. 2020-2022 మధ్య స్థానిక ఎన్నికల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. జార్జియా అటార్నీ జనరల్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డివిజన్‌లో లీగల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.
జెన్ జెడ్ తరానికి రాజకీయాలు బాగా తెలుసని చెప్పారు అశ్విన్ రామస్వామి. "మా జెనరేషన్ వాళ్లు వార్తలను బాగా చూస్తారు. జరుగుతున్న విషయాలను గమనిస్తారు. మంచి భవిష్యత్తును అందించాలని మేం కోరుకుంటున్నాం. కానీ మేం ఎదుర్కొనే ఒక సమస్య ఏమిటంటే, మా వద్ద వనరులు లేవు. అందుకే మేం గెలవడం కష్టం. ముఖ్యంగా ఎన్నికల్లో పెద్దవాళ్లను ఎన్నుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతారు. అందుకే నేను పోటీలో దిగాను. ఈ ఎన్నికల్లో గెలిచి అందరికీ ఓ ఉదాహరణగా నిలవాలని కోరుకుంటున్నాను" అని అశ్విన్ రామస్వామి చెబుతున్నారు.