Myanmar Airstrike :మయన్మార్‌లో సైన్యం దురాగతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక మందిని పొట్టనబెట్టుకున్న అక్కడి సైన్యం, తాజాగా ఓ సాయుధ మైనార్టీ గ్రూపు ఆధీనంలో ఉన్న గ్రామంపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో కనీసం 40 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్లు స్థానిక స్వచ్ఛంద సంస్థ అధికారులు వెల్లడించారు.
మయన్మార్‌లోని గ్రామంపై సైన్యం వైమానిక దాడి- 40మంది మృతి - MYANMAR AIRSTRIKE
మయన్మార్‌లో ఓ గ్రామంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 40మంది మృతి
Published : 17 hours ago
|Updated : 16 hours ago
పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో రామ్రీ ద్వీపంలో అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై జరిగిన దాడుల్లో వందలాది ఇళ్లు ధ్వంసమైనట్లు తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో ఇంటర్నెట్ సర్వీసులు, సెల్‌ఫోన్ సేవలను మాత్రం నిలిపివేశారు. భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న రఖైన్ ప్రాంతం ప్రస్తుతం అరకాన్ ఆర్మీ నియంత్రణలో ఉంది.
2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారం లాక్కున్నప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిపై దురాగతాలు పెచ్చుమీరుతున్నాయి. ఎదురు తిరిగే వారిని అణిచివేసేందుకు సైన్యం పెద్ద ఎత్తున వైమానిక దాడులకు తెగబడుతోంది. తిరుగుబాటు దళాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. శాంతియుత ప్రదర్శనల్ని అణిచివేసేందుకు ప్రయత్నించడం వల్ల అనేకమంది సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ఆయుధాలు చేతబట్టాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి.