Anura Dissanayake On Foreign Policy :శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అనుర కుమార దిసనాయకే పొరుగు దేశాలతో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనాల మధ్య తాము నలిగిపోదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. అసలు ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురికావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విదేశాంగ విధానంపై తన వైఖరిని తెలియజేశారు.
'వాటికి శ్రీలంక దూరం'
భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకోనే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని అనుర కుమార దిసనాయకే స్పష్టం చేశారు. తాము ఓ వర్గం పక్షం వహించమని తేల్చిచెప్పారు. భారత్-చైనాతో సంబంధాలను నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకొంటూ వెళ్లాలని నిర్ణయించిందని వెల్లడించారు.
'శాండ్ విచ్లా నలిగిపోవాలనుకోవడం లేదు'
"భౌగోళిక రాజకీయ యుద్ధంలో మేము పోటీదారులం కాదు. భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య భాగస్వామి కాబోము. వీటిల్లో శాండ్‌విచ్ వలే శ్రీలంక నలిగిపోవాలనుకోవడం లేదు. ముఖ్యంగా భారత్-చైనా మధ్య ఇబ్బంది పడాలని అనుకోవడంలేదు. ఇరు దేశాలు మాకు విలువైన మిత్రులే. ఎన్పీపీ ప్రభుత్వ హయాంలో మా స్నేహం మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాం."