Britain New King And Queen : బ్రిటన్ రాజు మూడో ఛార్లెస్ తన కుమారుడిని, కోడల్ని రాజు, రాణిగా పట్టాభిషేకం చేయించనున్నారా? రాజు ఇటీవల తన కోడలు కేట్ మిడిల్టన్‌తో సమావేశాన్ని నిర్వహించడం అదే అంతరంగాన్ని సూచిస్తోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. రాకుమారుడు విలియం ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ రాజు-రాణిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ముందుగానే సిద్ధమవుతున్నట్లు కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామం ఆ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి.
విలియం రాజుగా సింహాసనాన్ని అధిష్టించే విషయంలో రాజ కుటుంబంలో కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాన్సర్ బారినపడిన ఛార్లెస్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన పదవీ పరిత్యాగంపై ప్రచారం మరింత ఊపందుకుంది. మార్చిలో నిర్వహించిన ఓ సమావేశంలో కేట్ మిడిల్టన్ మాట్లాడుతూ తాను కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో మామ, కోడలికి పరస్పర అనుబంధం బలపడిందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కేట్ క్యాన్సర్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు.