Trump Executive orders : ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఈ సారి మునుపటి కన్నా దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోన్న ట్రంప్, తన కార్యవర్గ సభ్యుల ఎంపికపై దృష్టి సారిస్తూ ఇప్పటికే పలువురి పేర్లను ప్రకటించారు. అలానే వచ్చే నెలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే, మొదటి రోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని తెలిసింది. ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలపై ఆదేశాలు ఇవ్వనున్నారని సమాచారం.
అందుకే ఈ సారి ఏకంగా 25 ఆర్డర్లు
2017లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్, మొదటి రోజు కొన్ని ఆదేశాలపై మాత్రమే సంకతాలు చేశారు. ఇక 2021లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్, తొలి రోజు 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మునుపటిలా కాకుండా మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మొదటి రోజు దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. దీనికి సంబంధించి ప్రణాళికలకు ఇప్పటికే అధికారులకు సూచనలు కూడా చేసినట్లు తెలిసింది.
వాటిపై ట్రంప్ దృష్టి
అమెరికా-మెక్సికో సరిహద్దుకు అదనపు బలగాలను తరలించడం సహా సరిహద్దు గోడను పునర్నిర్మించడం వంటి వాటిపై ట్రంప్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేయనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. అలానే సరిహద్దు విధానాలకు సంబంధించి బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది.